Begin typing your search above and press return to search.

ఆ పెళ్లి పాట‌ల‌ను లెనిన్ మ‌రిపిస్తుందా?

తెలుగు కుటుంబాల్లో పెళ్లి వేడుకలంటే కేవలం ఆచారాలు, సంప్రదాయాలే కాదు, వాటిలో సంగీతం కూడా అంతే ముఖ్యమైన భాగం.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 May 2026 11:00 PM IST
ఆ పెళ్లి పాట‌ల‌ను లెనిన్ మ‌రిపిస్తుందా?
X

తెలుగు కుటుంబాల్లో పెళ్లి వేడుకలంటే కేవలం ఆచారాలు, సంప్రదాయాలే కాదు, వాటిలో సంగీతం కూడా అంతే ముఖ్యమైన భాగం. ప్రతి తరం తమ పెళ్లిళ్లలో ఒక ప్రత్యేకమైన పాటను గుర్తుగా మిగిల్చుకుంది. ఒకప్పుడు రాజేంద్ర ప్ర‌సాద్ పెళ్లి పుస్తకం సినిమాలోని పాట‌ పెళ్లి వేడుకలకు ఓ కొత్త అందాన్ని తీసుకొచ్చింది. తర్వాత మ‌హేష్ బాబు మురారిలోని పెళ్లి పాట తెలుగిళ్లలో శుభకార్యాలకు చిరునామాగా మారింది. త‌ర్వాత నితిన్ న‌టించిన శ్రీనివాస కల్యాణంలోని సాంగ్ కూడా వివాహ వేడుకల్లో తరచూ వినిపిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇప్పుడా లిస్ట్ లో చేరేందుకు లెనిన్ సినిమాలోని సాంగ్ తోడ‌వుతుంద‌నే టాక్ సినీ వ‌ర్గాల్లో బాగా వినిపిస్తోంది.

అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న లెనిన్ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలుండగా, తాజాగా లిరిక్ రైట‌ర్ రామజోగయ్య శాస్త్రి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. సినిమాలో ఒక అద్భుతమైన వెడ్డింగ్ సాంగ్ ఉందని, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అందుకు అద్భుతమైన ట్యూన్ అందించారని ఆయన వెల్లడించారు. అంతేకాదు, ఈ పాట రాసినందుకు తనకెంతో తృప్తిగా ఉందని చెప్తూ, ఇకపై అన్ని పెళ్లిళ్లలో ఈ సాంగ్ మార్మోగిపోవడం ఖాయ‌మ‌ని ట్వీట్ చేశారు. లిరిక్ రైట‌ర్ సాంగ్ రిలీజ‌వ‌క ముందే ఒక పాట గురించి ఇంత కాన్ఫిడెంట్ గా త‌న సాంగ్ గురించి చెప్పడం చాలా అరుదుగా జ‌రుగుతూ ఉంటుంది. దీంతో ఈ సాంగ్ లో స్పెషాలిటీ ఏమిటనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

అయితే ఒక పాట పెళ్లి పాట‌గా నిలవడం అంత సులభమైన విషయం కాదు. ఒక పాట పెళ్లిళ్లలో దశాబ్దాల పాటు వినిపించాలంటే అందులో సాహిత్యం, స్వరాలు, ఎమోష‌న్, సంప్రదాయం అన్నీ కలగలిపి ఉండాలి. ముఖ్యంగా తెలుగు కుటుంబాల సంస్కృతిని ప్రతిబింబించే పదాలు, పెళ్లి సందడి, బంధాల మాధుర్యం అందులో కనిపించాలి. గతంలో హిట్ అయిన పెళ్లి పాటలన్నీ వీటి వ‌ల్లే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఇప్పుడు లెనిన్ సాంగ్ కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. త‌మన్ మెలోడీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉండటం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉండటం ఈ పాటకు అదనపు బలం కానుంది. పైగా అఖిల్ కెరీర్‌లో ఇది కీలక సినిమా కావడంతో మేకర్స్ కూడా ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సాంగ్ గురించి చర్చ మొదలవడం గమనార్హం. పాట రిలీజ్ కాకముందే ఇలాంటి హైప్ రావడం అరుదు. అయితే ఈ సాంగ్ కు అస‌లు టెస్ట్ మాత్రం రిలీజ్ త‌ర్వాతే ఉంటుంది. ఒకప్పుడు పెళ్లి పుస్త‌కం, మురారి, శ్రీనివాస కళ్యాణం సాంగ్స్ ఎలా ప్రతి పెళ్లి వీడియోలో తప్పనిసరిగా వినిపించాయో, అదే స్థాయిలో లెనిన్ వెడ్డింగ్ సాంగ్ కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటేనే రామజోగయ్య శాస్త్రి మాటలు నిజమవుతాయి. మరి తెలుగు పెళ్లిళ్లకు కొత్త యాంథమ్‌గా ఈ పాట నిలుస్తుందా? లేక అంచనాలకే పరిమితమవుతుందా? అన్న సమాధానం కోసం ఇప్పుడు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్ప‌టికే లెనిన్ నుంచి రిలీజైన సాంగ్స్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.