Begin typing your search above and press return to search.

అఖిల్ 'లెనిన్'.. ఈ ప్లాన్ రిస్క్ అవుతుందా? కలిసొస్తుందా?

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. చాలా కాలంగా సరైన విజయాన్ని ఎదురుచూస్తున్న అఖిల్‌ కు సినిమా కీలకంగా మారడంతో ట్రైలర్‌ పై అందరి దృష్టి పడింది.

By:  M Prashanth   |   1 July 2026 1:13 PM IST
అఖిల్ లెనిన్.. ఈ ప్లాన్ రిస్క్ అవుతుందా? కలిసొస్తుందా?
X

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. చాలా కాలంగా సరైన విజయాన్ని ఎదురుచూస్తున్న అఖిల్‌ కు సినిమా కీలకంగా మారడంతో ట్రైలర్‌ పై అందరి దృష్టి పడింది. అయితే ట్రైలర్‌ కు వస్తున్న రెస్పాన్స్ లో ఆసక్తికరమైన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. అదే.. సినిమా కథను ట్రైలర్‌ లోనే ఎక్కువగా చూపించారా? అనే చర్చ.

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా రాయలసీమ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామాగా కనిపిస్తోంది. ట్రైలర్‌ లో అఖిల్‌ ను గతంలో కనిపించని రా అండ్ రస్టిక్ లుక్‌ లో చూపించారు. స్థానిక యాస, మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్, తమన్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ కు బలం చేకూర్చాయి. దీంతో సినిమా కమర్షియల్‌ గా మంచి స్థాయిలో ఉండొచ్చనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది.

అయితే ట్రైలర్‌ ను మరో యాంగిల్ లో చూసేవాళ్లు మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కథలో కీలక జర్నీ దాదాపు మొత్తం ట్రైలర్‌ లోనే చూపించారని వారు అంటున్నారు. హీరో సాధారణ వ్యక్తిగా కనిపించడం, అతని జీవితంలో విషాదం, ఆ తర్వాత రివెంజ్ కోసం చేసే పోరాటం, చివరికి మెయిన్ విలన్‌ తో తలపడే స్థాయి వరకు కథ ఎలా సాగుతుందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోందని అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా ట్రైలర్ అంటే ఆసక్తి పెంచాలి కానీ కథ మొత్తాన్ని చెప్పకూడదని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా థ్రిల్లింగ్ మూమెంట్స్, ట్విస్టులను దాచిపెడితేనే ప్రేక్షకుడు థియేటర్‌ కు వెళ్లినప్పుడు కొత్త అనుభూతి పొందుతాడని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో లెనిన్ ట్రైలర్ మాత్రం ఆ సస్పెన్స్‌కు పెద్దగా అవకాశం ఇవ్వలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు దీనిని మేకర్స్ ప్లాన్ దా తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయమూ ఉంది.

ఇటీవల ఆడియన్స్ స్టార్ హీరోలు చూసి థియేటర్లకు రావడం లేదు. కథలో బలం ఉందనే నమ్మకం కలిగితేనే వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. అందుకే కథలోని ఎమోషన్‌ ను ముందుగానే చూపించి ప్రేక్షకుల్లో విశ్వాసం పెంచాలనే ఉద్దేశంతో ట్రైలర్‌ను కట్ చేసి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. అయితే ఇలాంటి ప్రయత్నం సక్సెస్ కావాలంటే సినిమా ఎగ్జిక్యూషన్ చాలా బలంగా ఉండాలి.

ట్రైలర్‌ లో కనిపించిన సీన్స్ కంటే థియేటర్‌ లో మరింత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, ఎమోషన్స్, యాక్షన్ ఎలివేషన్స్ ఉంటేనే ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లేదంటే ప్రేక్షకుడు ముందే కథ అర్థమైపోయిందనే భావనతో కొంత నిరాశ చెందే అవకాశమూ ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు లెనిన్ ట్రైలర్ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. కానీ ట్రైలర్‌ లోనే కథను ఎక్కువగా చూపించడం రిస్క్‌ గా మారుతుందా? లేక ప్రేక్షకుల్లో నమ్మకం పెంచి మూవీకి ప్లస్ అవుతుందా? అన్న ప్రశ్నకు ఆన్సర్ మాత్రం జూలై 10న మూవీ రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.