ఆ నలుగురి తరువాత అఖిల్ ఆహా అనిపిస్తాడా?
అక్కినేని మూడవ తరం వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేని గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ని దక్కించుకోలేకపోతున్నాడు.
By: Tupaki Desk | 9 April 2025 5:00 PM ISTఅక్కినేని మూడవ తరం వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేని గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ని దక్కించుకోలేకపోతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు ఇంపాక్ట్ కలిగించే బ్లాస్టింగ్ హిట్‌ని సొంతం చేసుకోలేకపోయాడు. దీంతో ఏడాదిన్నర పాటు కొత్త ప్రాజెక్ట్ విషయంలో తర్జనభర్జన పడి ఫైనల్‌గా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే `లెనిన్`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
`వినరో భాగ్యము విష్ణు కథ` ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దర్శకుడు. తొలి చిత్రాన్ని రాయలసీమ నేపథ్యంలోనే రూపొందించిన ఈ దర్శకుడు అఖిల్‌తో చేస్తున్న `లెనిన్` కోసం కూడా అదే రాయలసీమని బ్యాక్‌డ్రాప్‌గా ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. దర్శకుడికిది రెండవ సినిమా అయినా అఖిల్ కు సీమ నేపథ్యంలో తొలి సినిమా. సీమ యాస నేపథ్యంలో ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ `సమరసింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవి `ఇంద్ర` చేశారు.
ఇవి వీరి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచి వాసూళ్ల పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి. ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆది` వంటి బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. వీరి తరువాత సీమ యాసతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ `పుష్ఫ`, `పుష్ప 2`. ఇందులో బన్నీ బారు గడ్డం. లుంగీ ధరించి మాసీవ్ లుక్‌లో కనిపించి చిత్తూరు యాసలో అదరగొట్టి పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేరడం తెలిసిందే.
ఇప్పుడు ఈ నలుగురు హీరోలని అక్కినేని అఖిల్ ఫాలో అవుతున్నాడు. రాయలసీమ యాసతో అఖిల్ తాజా మూవీ `లెనిన్` సాగుతుందని తెలుస్తోంది. మంగళవారం అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీలీల ఇందులో అఖిల్‌కు జోడీగా నటిస్తోంది. టైటిల్ గ్లింప్స్‌లో సీమ యాసలో చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. పొడవైన గడ్డం.. రగ్గ్‌డ్ లుక్‌తో అఖిల్ తొలిసారి ఊరమాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లలో అఖిల్ లుక్ బన్నీ పుష్పరాజ్‌ని గుర్తు చేస్తోంది. `లెనిన్` కోసం తొలిసారి సీయ యాస మాట్లాడుతున్న అఖిల్ ఆ వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. బన్నీని గుర్తు చేయకుండా ఉండాలంటే ఆ మార్కు మ్యానరిజమ్స్‌ని అవాయిడ్ చేస్తూ తనదైన మార్కుని చూపించాల్సిందే.
