Begin typing your search above and press return to search.

అఖిల్ 'లెనిన్'.. డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం ఎలా ఉందంటే?

వరుస వాయిదాల కారణంగా ఆ సినిమాపై చర్చలు పెరిగినా.. మరోవైపు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మాత్రం నమ్మకం తగ్గలేదని టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   16 Jun 2026 5:00 AM IST
అఖిల్ లెనిన్.. డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం ఎలా ఉందంటే?
X

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లెనిన్ విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుస వాయిదాల కారణంగా ఆ సినిమాపై చర్చలు పెరిగినా.. మరోవైపు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మాత్రం నమ్మకం తగ్గలేదని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా వెనుక ఉన్న ప్రొడక్షన్ హౌస్ లు.. డిస్ట్రిబ్యూటర్లకు ధైర్యం ఇస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అఖిల్ కెరీర్‌ లో ఆ సినిమా అత్యంత కీలకంగా మారింది. ఇప్పటివరకు ఆయనకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కకపోవడంతో లెనిన్ తో ఎలాగైనా బ్లాక్‌ బస్టర్ అందుకోవాలనే పట్టుదలతో మూవీ టీమ్ పనిచేస్తోందని టాక్ వినిపిస్తోంది.

నిజానికి లెనిన్ మూవీ తొలుత మే 1న విడుదల కావాల్సి ఉంది. అనంతరం జూన్ 26కు వాయిదా పడింది. తాజాగా మరోసారి విడుదల తేదీని మార్చి జులై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. సాధారణంగా వరుసగా విడుదల తేదీలు మారితే డిస్ట్రిబ్యూటర్లలో డౌట్లు వ్యక్తమవుతాయి. కానీ లెనిన్ విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోందని తెలుస్తోంది.

దానికి ప్రధాన కారణం ప్రొడక్షన్ హౌసెస్ క్రెడిబిలిటీ. అన్నపూర్ణ స్టూడియోస్‌ కు పలు ప్రాంతాల్లో సొంత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండటం, మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్‌ కు చెందిన నాగ వంశీ మార్కెట్‌ పై మంచి పట్టు ఉండటం కలిసి వస్తున్న అంశాలుగా తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ముందుగానే పాజిటివ్ గా సాగినట్లు సమాచారం.

థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం, ఉత్తరాంధ్ర, కృష్ణా ప్రాంతాల్లో అన్నపూర్ణ సంస్థ స్వయంగా పంపిణీ బాధ్యతలు చేపడుతోంది. మిగిలిన ఏరియాల్లో నాగ వంశీతో వర్క్ చేసే డిస్ట్రిబ్యూటర్లు సినిమాను విడుదల చేయనున్నారు. నాగ వంశీ సెలెక్ట్ చేసే ప్రాజెక్టులపై డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న నమ్మకం కారణంగా, వారు అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక కంటెంట్ విషయంలో కూడా మూవీ టీమ్ రాజీ పడడం లేదని సమాచారం. సినిమా చిత్రీకరణ పూర్తయినా కొన్ని సన్నివేశాలు మరోసారి పరిశీలించి అవసరమైన చోట రీషూట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రీషూట్లను నెగెటివ్‌ గా భావించినా, మంచి అవుట్‌ పుట్ కోసం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎడిటింగ్ టైమ్ లో కూడా నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

వినరో భాగ్యము విష్ణు కథ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో అఖిల్ తొలిసారిగా రీజనల్ బ్యాక్ డ్రాప్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు. చిత్తూరు యాసలో ఆయన డైలాగులు చెప్పనున్నట్లు సమాచారం. హీరోయిన్ గా భాగ్యశ్రీ బొర్సే నటిస్తున్నారు. ఏదేమైనా వరుస వాయిదాలు లెనిన్ పై ప్రశ్నలు లేవనెత్తినా, ప్రొడక్షన్ హౌసెస్ స్ట్రెంత్, డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం, కంటెంట్‌ పై తీసుకుంటున్న జాగ్రత్తలు సినిమాపై అంచనాలను నిలబెడుతున్నాయి. దీంతో అందరి దృష్టి జులై 10పైనే ఉంది. మరి అఖిల్ ఎదురుచూస్తున్న విజయాన్ని అందుకుంటారా? డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని లెనిన్ నిలబెడుతుందా? అనేది చూడాల్సి ఉంది.