Begin typing your search above and press return to search.

పదేళ్ల కష్టానికి ఫలితం వస్తుందా? ‘లెనిన్’తో అఖిల్ సక్సెస్ అందుకున్నాడా ?

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతున్నా ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్.. తాజాగా ‘లెనిన్’ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By:  Madhu Reddy   |   10 July 2026 9:00 PM IST
పదేళ్ల కష్టానికి ఫలితం వస్తుందా? ‘లెనిన్’తో అఖిల్ సక్సెస్ అందుకున్నాడా ?
X

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతున్నా ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్.. తాజాగా ‘లెనిన్’ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పల్లెటూరి డ్రామా నేడు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ కోరుకున్న బ్రేక్ వచ్చిందా? ఈ చిత్రంలో అక్కినేని కుర్రాడి నటన, గెటప్ ఎలా ఉన్నాయి? అసలు విశేషాలు చూద్దాం..

భారతం మిట్ట.. లెనిన్ కథేంటి?:

చిత్తూరు జిల్లాలోని 'భారతం మిట్ట' అనే ఊరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడ అనాథగా ఉన్న లెనిన్ (అఖిల్)ను వసంత్ (ప్రమోద్) అనే వ్యక్తి చేరదీసి తన సొంత తమ్ముడిలా పెంచుతాడు. ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉండే లెనిన్, భారతి (భాగ్యశ్రీ బోర్సే) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అనూహ్యంగా భారతిని వసంత్ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు లెనిన్ ఏం చేశాడు? ఆ ఊరిలో ఎలాంటి గొడవలు జరిగాయనేదే అసలు సినిమా.

నేల విడిచి సాము చేయని అక్కినేని కుర్రాడు:

గత సినిమాల్లో కేవలం స్టైలిష్ లుక్స్, భారీ మాస్ ఎలివేషన్లను నమ్ముకున్న అఖిల్.. ఈసారి రూట్ మార్చాడు. కథను నమ్ముకుని, అందులో ఒక పాత్రలా ఒదిగిపోయాడు. పాత సినిమాల ఛాయలు ఎక్కడా కనిపించకుండా పల్లెటూరి కుర్రాడిగా అఖిల్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక వింటేజ్ నాగార్జున లుక్‌ని గుర్తుచేసేలా ఉన్న గెటప్, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ యాక్షన్ సీన్లలో అఖిల్ చూపించిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మహాభారతం ముడిపడిన ఆసక్తికర స్క్రీన్‌ప్లే:

దర్శకుడు మురళి కిషోర్ ఈ కథను చిత్తూరు పల్లెటూళ్లలో జరిగే మహాభారత నాటకాల చుట్టూ అల్లాడు. మహాభారతంలో ఉండే స్నేహం, నమ్మకద్రోహం, కుట్రలు ఇందులోనూ కనిపిస్తాయి. ఇక సినిమా మొదట్లో లవ్ సీన్స్ కాస్త మామూలుగా అనిపించినా, ప్రీ-ఇంటర్వెల్ నుండి కథ స్పీడందుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య లవ్ డెప్త్, విలన్ పగకు బలమైన కారణాలు లేకపోవడం వల్ల ఎమోషన్ అనుకున్నంత రేంజ్‌లో పండలేదు.

తమన్ మ్యూజిక్ మ్యాజిక్.. నటీనటుల జోరు:

సినిమాకు తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, 'ఎట్టా ఎట్టా', 'వారెవా' పాటలు పెద్ద ప్లస్ పాయింట్లు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అందం, అభినయంతో మెప్పించగా, కన్నడ నటుడు ప్రమోద్ కొన్ని సీన్లలో అఖిల్‌ను డామినేట్ చేసేలా నటించాడు. ఇక విలన్‌గా శివాజీ, తల్లి పాత్రలో ఈశ్వరీ రావు బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ట్విస్టుల కోసం కథ రాసినట్లు అనిపించినా, ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమా అలా సాగిపోతుంది.

‘లెనిన్’ సినిమా అఖిల్ కెరీర్‌ను రాత్రికి రాత్రే మార్చేసే పెద్ద అద్భుతమేమీ కాదు గానీ.. ఆయన పాత సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా బెటర్. కమర్షియల్ ఎలిమెంట్స్, అదిరిపోయే ట్విస్టులు, అఖిల్ సరికొత్త యాక్టింగ్ కోసం ఈ వీకెండ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే ఒకసారి హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అఖిల్‌కు ఎలాంటి వసూళ్లను తెచ్చిపెడుతుందో చూడాలి..