Begin typing your search above and press return to search.

లెనిన్ కోసం డ్రాగ‌న్? అదే నిజ‌మైతే నెక్ట్స్ లెవెల్ హైప్

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్‌పై ఆసక్తికరమైన డిస్క‌ష‌న్స్ మొదలయ్యాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 July 2026 4:34 PM IST
లెనిన్ కోసం డ్రాగ‌న్? అదే నిజ‌మైతే నెక్ట్స్ లెవెల్ హైప్
X

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్‌పై ఆసక్తికరమైన డిస్క‌ష‌న్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించగా, ఇప్పుడు ప్రమోష‌న‌ల్ ఈవెంట్స్ ను మరింత బలంగా నిర్వహించేందుకు నిర్మాతలు స్పెష‌ల్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా ప్రచారం ప్రకారం, ఈ సినిమా ప్రమోషన్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగమయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా అఖిల్‌ను ఎన్టీఆర్ ఇంటర్వ్యూ చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్‌కు అక్కినేని కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు పరస్పరం ఒకరి సినిమాలకు మరొకరు శుభాకాంక్షలు తెలియజేయడం, ప్రత్యేక సందర్భాల్లో కలిసి కనిపించడం జరిగింది. అందుకే ఇప్పుడు లెనిన్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారనే ప్రచారం వేగంగా వైరల్ అవుతోంది. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ నిజమైతే, సినిమా రిలీజ్ కు ముందు జరిగే అత్యంత కీలక ప్రమోషనల్ ప్లాన్స్ లో ఇదొకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా స్టార్ లెనిన్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనడం వల్ల సినిమాపై సాధారణ ప్రేక్షకుల్లో కూడా మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక అఖిల్ కెరీర్ పరంగా చూస్తే లెనిన్ అత‌నికి ఎంతో కీలకమైన సినిమా. గత సినిమా ఫలితాల తర్వాత సరైన స‌క్సెస్ ను అందుకోవాలనే లక్ష్యంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు, టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ట్రైలర్‌ను ప్రశంసిస్తూ అఖిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో సినిమాపై సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ప్రమోషన్స్‌ను మరింత దూకుడుగా నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

రాయలసీమ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామాగా లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ కు సమాన ప్రాధాన్యతనిస్తూ డైరెక్ట‌ర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాను తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటారనే ప్రచారం కూడా నిజమైతే, రిలీజ్‌కు ముందు సినిమాకు మరింత హైప్ తీసుకురావడంలో అది కీలక పాత్ర పోషించే అవకాశముంది. అయితే ఈ వార్తపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. కాగా గ‌తంలో అఖిల్ న‌టించిన మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్టు గా వ‌చ్చిన విష‌యం తెలిసిందే.