Begin typing your search above and press return to search.

మూడేళ్ల గ్యాప్ అఖిల్‌ను పూర్తిగా మార్చేసిందా?

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే హీరోలు తమ సినిమాను ఇండస్ట్రీ హిట్, కెరీర్ బెస్ట్, రికార్డులు బ్రేక్ చేసే సినిమా అంటూ భారీ అంచనాలు పెంచడం సహజంగా కనిపించేది.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 July 2026 5:00 PM IST
మూడేళ్ల గ్యాప్ అఖిల్‌ను పూర్తిగా మార్చేసిందా?
X

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే హీరోలు తమ సినిమాను ఇండస్ట్రీ హిట్, కెరీర్ బెస్ట్, రికార్డులు బ్రేక్ చేసే సినిమా అంటూ భారీ అంచనాలు పెంచడం సహజంగా కనిపించేది. కానీ అఖిల్ అక్కినేని మాత్రం తన తాజా సినిమా లెనిన్ ప్రమోషన్స్‌లో పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అఖిల్ నుంచి మూడేళ్ల కింద‌ట‌వ‌చ్చిన ఏజెంట్ తర్వాత ఏర్పడిన పరిస్థితులు అతని ఆలోచనా విధానాన్ని మార్చేశాయా? ప్రస్తుతం అతని మాటలు చూస్తుంటే అదే అభిప్రాయం కలుగుతోంది.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఏజెంట్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైన ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల పాటు అఖిల్ నుంచి మ‌రో సినిమా రాలేదు. ఈ గ్యాప్‌లో స్టోరీల ఎంపిక మాత్రమే కాదు, తనను తాను ఎలా ప్రజెంట్ చేసుకోవాలనే విషయంలో కూడా అతనిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో కనిపించిన ఉత్సాహం, అతిశయోక్తి మాటలకు బదులుగా ఇప్పుడు ప్రశాంతంగా, ఏం మాట్లాడినా కొలిచిన‌ట్టు మాట్లాడే అఖిల్‌ను చూసి ఆడియ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

తాజా ఇంటర్వ్యూల్లో అఖిల్ చెప్పిన ఒక విషయం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. త‌న సినిమా గురించి తాను ఇప్పుడు ఎక్కువగా చెప్పన‌ని, సినిమానే మాట్లాడాలని, రిలీజ్ త‌ర్వాత ఆడియ‌న్స్ నుంచి రెస్పాన్స్ వ‌చ్చిన త‌ర్వాత తాను మాట్లాడ‌తాన‌ని చెప్ప‌డం సాధారణ ప్రమోషనల్ డైలాగ్‌లకు పూర్తి భిన్నంగా నిలిచింది. తన కెరీర్‌లో ఇంకా పెద్ద బ్రేక్ రాలేదని, గతంలో ఎదురైన ఫ్లాపుల నుంచి చాలా నేర్చుకున్నానని అఖిల్ స్వయంగా ఒప్పుకోవ‌డం కూడా ఆడియ‌న్స్ లో సానుకూల రెస్పాన్స్ ను తెచ్చిపెడుతోంది.

స్టార్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలకు అవకాశాలు దొరకడం ఒక విషయ‌మైతే, తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం మరో విషయం. అక్కినేని కుటుంబ వారసత్వం అఖిల్‌కు ఒక పెద్ద బలం అయినప్పటికీ, అదే సమయంలో ప్రతి సినిమాపై భారీ అంచనాలు కూడా తీసుకొచ్చింది. ఆ అంచనాలను అందుకోలేకపోయిన సందర్భాలు అతని కెరీర్‌పై ప్రభావం చూపాయి. ఇప్పుడు మాత్రం స్టార్ కిడ్ అనే ట్యాగ్‌ను దాటి తన టాలెంట్ తోనే ఆడియ‌న్స్ విశ్వాసాన్ని గెలుచుకోవాలనే ప్రయత్నం అఖిల్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక లెనిన్ ప్రమోషన్స్‌ను గమనిస్తే మరో ఆసక్తికర అంశం కనిపిస్తోంది. ఈ సినిమాను మేక‌ర్స్ ఎక్కడా అతిగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం లేదు. రికార్డులు, కలెక్షన్లు, ఇండస్ట్రీ హిట్‌ల గురించి పెద్దగా మాట్లాడకుండా, ట్రైలర్‌తో పాటు సినిమా కంటెంట్‌పైనే నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. ఈ విధానం కూడా ప్రేక్షకుల్లో అంచనాలను సహజంగానే పెంచుతోంది. కొన్నిసార్లు అతిగా ప్రచారం చేయడం కంటే, సినిమానే మాట్లాడనివ్వడం మంచి వ్యూహమనే అభిప్రాయం ఇండస్ట్రీలో కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం అఖిల్ ఎదుర్కొంటున్న అసలు పరీక్ష బాక్సాఫీస్ స‌క్సెస్ మాత్ర‌మే కాదు. గతంలో దెబ్బతిన్న ప్రేక్షకుల నమ్మకాన్ని తిరిగి సంపాదించడం కూడా అంతే కీలకం. అందుకే లెనిన్ అతనికి కేవ‌లం సినిమాగానే కాదు, యాక్ట‌ర్ గా తనలో వచ్చిన మెచ్యూరిటీని, తనకంటూ ప్రత్యేక గుర్తింపును, కొత్త ఆలోచనా విధానాన్ని నిరూపించుకునే అవకాశంగా ఈ సినిమాను అఖిల్ చూస్తున్నట్లు అనిపిస్తోంది. మ‌రి జులై 10న రిలీజ్ కానున్న లెనిన్, అఖిల్ కు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.