మారేడుమిల్లులో బాలయ్య తాండవం!
ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం షూటింగ్ మారేడుమిల్లు అటవీ ప్రాతంలో జరుగుతోంది.
By: Tupaki Desk | 25 July 2025 12:28 PM ISTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య 'అఖండ2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం షూటింగ్ మారేడుమిల్లు అటవీ ప్రాతంలో జరుగుతోంది. వారం రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఇందులో బాలయ్య సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని పోరాట ఘట్టాలు కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే టీమ్ పనిచేసింది. బాలయ్య సహ అందరు బోయపాటికి సహకరించడంతో షెడ్యూల్స్ అన్ని వేగంగానూ పూర్తవుతున్నాయి. ముందుగా చెప్పినట్లుగానే చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. సెప్టెంబర్ 25న పక్కాగా రిలీజ్ చిత్రంగా కనిపిస్తుంది. ఈసినిమాకు ఎన్ని సినిమాలు పోటీగా వచ్చినా బాలయ్య మాత్రం తగ్గేదేలే. పక్కా ప్రణాళికతోనే బరిలోకి దిగుతున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
కీలక సన్నివేశాలకు సంబంధించి సీజీ వర్క్ వేగంగానే జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సీజీ, విఎఫ్ ఎక్స్ కారణంగానే సినిమాలు వాయిదా పడుతున్నాయి. బెస్ట్ అవుట్ పుట్ తీసుకోవడం కోసం మేకర్స్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 'అఖండ 2' లో కూడా విజువల్ ఎఫెక్స్ట్ కు అధిక ప్రాధాన్యత ఉంది. యాక్షన్ సన్నివేవాల్లో సహజత్వం కనిపించాలంటే విఎఫ్ఎక్స్ కీలకమైంది. ఈ నేపథ్యంలో బోయపాటి ముందుగానే భావించి షూటింగ్ తో పాటు ఏకధాటిగా ఆ పనులు కూడా నిర్వహిస్తున్నారు.
అటు సంగీత దర్శకుడు థమన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈసారి తన బాదుడుకి థియేటర్లు పగిలిపోయినా తనకు సంబంధం లేదని ముందే హెచ్చరించాడు. ఆ రేంజ్ లో బీజీఎమ్ ఉంటుందని సంకేతాలు పంపించాడు. అటు తమన్..ఇటు బోయపాటి మధ్యలో బాలయ్య దరువు, దబిడి దిబిడి మామూలుగా ఉండదు.
