Begin typing your search above and press return to search.

కన్నప్ప, వీరమల్లు కష్టాలే 'అఖండ 2' కి..!

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఏవీ ముందుగా ప్రకటించిన డేట్‌లో రావడం లేదు. ఎంతో పెద్ద హీరోల సినిమాలైనా షూటింగ్స్ సమయానికి జరిగినా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 July 2025 12:00 AM IST
కన్నప్ప, వీరమల్లు కష్టాలే అఖండ 2 కి..!
X

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఏవీ ముందుగా ప్రకటించిన డేట్‌లో రావడం లేదు. ఎంతో పెద్ద హీరోల సినిమాలైనా షూటింగ్స్ సమయానికి జరిగినా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడుతున్నాయి. ఇటీవల విడుదలైన 'కన్నప్ప' సినిమా ఏకంగా ఆరు నెలలు ఆలస్యం అయింది. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ విషయంలో సంతృప్తి లేకపోవడం వల్ల కొత్తగా చేయించారు. హరి హర వీరమల్లు సినిమా గత నెలలో విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి కాని కారణంగా సినిమాను వాయిదా వేసి ఈ నెల చివరి వారంలో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు వీఎఫ్ఎక్స్‌ వర్క్‌ ఆలస్యం కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' సినిమా విడుదల విషయంలో స్పష్టత లేకపోవడంకు కారణం వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ విషయంలో స్పష్టత లేకపోవడం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎప్పుడైతే వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి అవుతుందో అప్పుడే ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూసిన తర్వాత రిలీజ్ డేట్‌ విషయమై ప్రకటన చేస్తామని అభిమానులకు మేకర్స్ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఇలా చాలా సినిమాలు వీఎఫ్‌ఎక్స్‌ కారణంగా ఆలస్యం కావడం, వాయిదా పడటం జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 సినిమా చేరినట్లు సమాచారం అందుతోంది.

దసరా కానుకగా అఖండ 2 సినిమాను సెప్టెంబర్‌ చివరి వారంలో విడుదల చేయబోతున్నట్లు మొదట ప్రకటన వచ్చింది. కానీ సెప్టెంబర్‌ వరకు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఈనెల చివరి వరకు అఖండ 2 సినిమా షూటింగ్‌ను ముగించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను ఆగస్టులో ముగించాలని భావించినప్పటికీ అది సాధ్యం కాదని ఇటీవల టీం మీటింగ్‌లో దర్శకుడికి సదరు వీఎఫ్‌ఎక్స్ కంపెనీ వారు చెప్పారట. దాంతో షూటింగ్‌ మెల్లగా చేస్తున్నాడని, డిసెంబర్‌లో సినిమా విడుదల చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ అభిమానులతో పాటు అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంతో చాలా మంది అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. అఖండ సినిమా హిందుత్వంపై సాగుతుంది. ఇప్పుడు అఖండ 2 లో అంతకు మించి అన్నట్లుగా సనాతన ధర్మం చుట్టూ కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. ముఖ్య పాత్రలో హర్షాలీ మల్హోత్రా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. డిసెంబర్‌ 18న సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.