సాధారణంగా సినీ రంగంలో ఒక్క హిట్ కొట్టాలంటే అన్నీ కలిసి రావాలి. అలాంటిది కొందరు హీరోలు మాత్రం సక్సెస్‌ల మీద సక్సెస్‌లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ‘అఖండ’తో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన.. అక్కడి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్నారు. ఈ ఊపులోనే కొత్త చిత్రాలను కూడా వేగంగా చేసేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగానే సాగుతోంది. ఇదిలా ఉండగానే ఈ సీనియర్ స్టార్ హీరో తన తదుపరి సినిమాను కూడా లైన్‌లో పెట్టుకున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించబోయే ఇది గతంలో హిట్ అయిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రానుంది. అందుకే దీనికి ‘అఖండ 2.. తాండవం’ అనే టైటిల్ పెట్టారు.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవలే కంప్లీట్ చేసుకున్నారు. ఆరోజు ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీని ద్వారా ఈ మూవీపై అంచనాలను సైతం పెంచేశారు. ఇక, ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందిస్తున్నట్లు కూడా వెల్లడించారు. అందుకు తగ్గట్లే ఈ ఫిల్మ్‌కు భారీ బడ్జెట్‌ను కూడా పెట్టబోతున్నారు.
‘అఖండ 2’ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీనటులనే తీసుకోవాలని బోయపాటి శ్రీను భావిస్తున్నట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ రోల్ కోసం పేరున్న స్టార్ హీరోనే ఎంపిక చేయాలని ప్లాన్ చేశారట. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లోని ఓ బడా హీరోపై బోయపాటి ఫోకస్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
నందమూరి బాలకృష్ణకు ఓ రేంజ్ ఉంది. దీనికితోడు హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’ కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను తీసుకోవాలని చూస్తున్నారట. త్వరలోనే ఆయనకు బోయపాటి శ్రీను కథను వినిపించబోతున్నట్లు తెలిసింది. ఆయన ఓకే అంటే వెంటనే షూట్ కూడా ప్రారంభిస్తారని అంటున్నారు. ఒకవేళ సంజయ్ దత్ ఒప్పుకోని పక్షంలో మరో హిందీ హీరోనే చూస్తారని సమాచారం. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కావున హిందీ నుంచి కూడా క్రేజ్ రావాలనే విధంగా ఆలోచిస్తున్నారు.
‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతోన్న ‘అఖండ 2’ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నందమూరి తేజస్విని సమర్పణలో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రను చేస్తోంది. థమన్ ఈ మూవీకి సంగీతం ఇస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూట్ ప్రారంభం కాబోతుంది.