Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ వేదికపై మన హీరో నెం.2!

అలాంటి హీరోలు ఉన్న మన ఇండస్ట్రీలో అందరి కంటే తాను చాలా ప్రత్యేకం అంటూ నిరూపించుకుంటూ తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ రేసింగ్‌ లో దూసుకు పోతున్నాడు.

By:  Tupaki Desk   |   21 April 2025 1:48 PM IST
Ajith Kumar’s Racing Team Finishes No.2
X

సాదారణంగా హీరోలు షూటింగ్‌ కోసం కూడా బైక్ రైడింగ్‌, కారు డ్రైవింగ్‌ వంటివి చేసేందుకు భయపడుతారు. చిన్న గాయం అయినా నెలలకు నెలలు రెస్ట్‌ తీసుకోవాలి, షూటింగ్స్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే హీరోలు ఎక్కువ శాతం మంది యాక్షన్‌ సన్నివేశాల్లో కష్టమైన స్టంట్స్‌ను డూప్‌ సహాయంతో చేస్తారు. అలాంటి హీరోలు ఉన్న మన ఇండస్ట్రీలో అందరి కంటే తాను చాలా ప్రత్యేకం అంటూ నిరూపించుకుంటూ తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ రేసింగ్‌ లో దూసుకు పోతున్నాడు. రెండు దశాబ్దాలుగా రేసింగ్‌ పై ఆసక్తితో ఎన్నో బైక్‌ రైడ్స్‌ చేసిన ఆయన ఇప్పుడు కారు రేసింగ్‌ టీం బృందానికి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

అజిత్‌ తన రేసింగ్ టీంతో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు. రెండు నెలల క్రితం విదేశాల్లో జరిగిన ఒక మెగా రేసింగ్ టోర్నీలో అజిత్ కుమార్‌ అండ్‌ టీం సత్తా చాటిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి అజిత్ రేసింగ్ టీం సత్తా చాటింది. ఇటీవల బెల్జియం లో జరిగిన స్పా ఫ్రాంకోర్‌ చాంప్స్ సర్క్యూట్‌ రేసులో అజిత్‌ కుమార్ టీం పాల్గొంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రేసర్లు ఆ రేసులో పాల్గొన్నారు. ఎన్నో టీంలను పక్కన నెట్టి అజిత్‌ కుమార్‌ టీం ఏకంగా నెం.2 స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని అజిత్‌ కుమార్‌ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. భారత రేసర్లకు ఇది గర్వకారణం అంటూ ఆయన ట్వీట్‌ చేశాడు.

అంతర్జాతీయ స్థాయిలో నెం.2 గా అజిత్‌ రేసింగ్ టీం నిలవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో మూడు నాలుగో స్థానంలో నిలుస్తూ వచ్చిన అజిత్ టీం ఇప్పుడు నెం.2 గా నిలవడం ద్వారా తమ సామర్థ్యంను మెరుగు పరుచుకున్నట్టు అయిందని అభిమానులు అంటున్నారు. ముందు ముందు వరల్డ్‌ నెం.1 గా అజిత్‌ రేసింగ్ టీం నిలవాలని ఇండియన్ రేసర్లు, ఇంకా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం అజిత్‌ పై ప్రముఖులు పలువురు ప్రశంసలు కురిపిస్తూ ఆయన టీం మెంబర్స్‌ను అభినందిస్తున్నారు.

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నిరాశను మిగిల్చినా తమిళనాడులో అజిత్‌ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ నేపథ్యంలో డీసెంట్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. లాంగ్‌ రన్‌లోనూ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ముందు ముందు సినిమా ఓటీటీలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతోంది.