Begin typing your search above and press return to search.

స్టార్ హీరో అజిత్ కి మాతృవియోగం!

కోలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టార్ హీరో అజిత్ మాతృమూర్తి కన్నుమూశారు.

By:  Madhu Reddy   |   30 May 2026 10:26 AM IST
స్టార్ హీరో అజిత్ కి మాతృవియోగం!
X

కోలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టార్ హీరో అజిత్ మాతృమూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అజిత్ తల్లి మోహిని చెన్నైలోని తన నివాసంలో శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించడంతో అజిత్ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అజిత్ తల్లి మోహిని వయసు 84 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తండ్రి మరణించిన మూడేళ్లకే తల్లి మరణం..

కాగా, గత మూడు సంవత్సరాలు క్రితమే అనగా 2023లో అజిత్ తండ్రి పి.ఎస్. సుబ్రహ్మణ్యం కూడా ఇలా వృద్ధాప్య సమస్యల వల్లే స్వర్గస్తులయ్యారు. అప్పుడు తండ్రి.. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో అజిత్ కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రి లేరనే వార్త నుంచి ఇంకా కోలుకోక ముందే ఇప్పుడు తల్లి మరణం కూడా ఆయనను మరింత విషాదంలోకి నెట్టివేసింది. తల్లి మరణాన్ని అజిత్ జీర్ణించుకోలేకపోతున్నారు.

దుబాయ్ నుండి హుటాహుటిన బయలుదేరిన అజిత్..

ఇకపోతే ప్రస్తుతం అజిత్ తన ప్రాజెక్టు పనుల నిమిత్తం దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం. ఇక తన తల్లి మరణ వార్త తెలియగానే వెంటనే ఆయన అత్యవసరంగా చెన్నైకి బయలుదేరారు. అజిత్ చెన్నైకి చేరుకున్న తర్వాతే ఆయన తల్లి మోహిని అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అజిత్ తల్లి లేరనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ , అభిమానులు, సినీ సెలబ్రిటీలు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అలాగే తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర బాషా నటీనటులు, దర్శకులు కూడా ఆమె మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న పాత్రతో మొదలైన కెరియర్..

1990లో వచ్చిన తమిళ రొమాంటిక్ డ్రామా ఎన్ వీడు ఎన్ కనవర్ అనే చిత్రం ద్వారా కెరియర్ ప్రారంభించిన అజిత్.. 1995లో వచ్చిన ఆసై అనే చిత్రంతో నటుడిగా మంచి బ్రేక్ అందుకున్నారు. అవల్ వరువాలా, కాదల్ మన్నన్, కాదల్ కోట్టై అని చిత్రాలతో రొమాంటిక్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అజిత్.. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వాలీ అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి.. తన నటుడితో ఉత్తమ నటుడిగా మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకని నటుడిగా స్థిరపడ్డారు.

అజిత్ ప్రస్తుత సినిమాలు..

ఇక తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్ కుమార్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మాస్, ఎమోషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయిలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే ఇలా తన తల్లి మరణించింది అనే వార్తను తెలుసుకున్న అజిత్ హుటాహుటిన చెన్నైకి బయలుదేరారు. ఇక అజిత్ తల్లి మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు , చిత్ర బృందం జీర్ణించుకోలేకపోతున్నారు.