అభిమానుల అతి ప్రేమ ప్రాణం మీదకు తెచ్చేలా!
ఈ సందర్భంగా తమిళనాడులోని తెంకాశీ పట్టణం లోని ఓ థియేటర్ వద్ద 285 అడుగుల భారీ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేసారు.
By: Tupaki Desk | 7 April 2025 7:40 AMస్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే? ఆ హీరోల కటౌట్లు థియేటర్ ముందు ఏ రేంజ్ లో దర్శనమి స్తాయో చెప్పాల్సిన పనిలేదు. మా హీరో ఒక్కడే గొప్ప అన్న నినాదంతోనే ప్రతీ హీరో అభిమాని ముందు కెళ్తాడు. ఈ ఒక్క కారణం ఎన్ని రకాల యుద్దాలకు దారి తీస్తుందో తెలిసిందే. ఒకప్పుడు అభిమాన సంఘాల మధ్య వివాదాలొచ్చేవి. కోట్లాట జరిగేవి. ఇప్పుడా సంఘాలకు బధులు సోషల్ మీడియా వేదికగా తన్నుకుంటున్నారు.
మాటలతో ఒకర్ని ఒకరు దూషించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టుకుంటున్నారు. ఈ గొప్ప సంస్కృతి కనిపించేది కేవలం టాలీవుడ్...కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే. దేశంలో ఎన్నో చిత్ర పరిశ్రమలున్నాయి. కానీ ఎక్కడా లేని గొప్ప సంస్కృతి ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ విషయంలో అభిమానులు మారండని రెండు పరిశ్రమల హీరోలు మోత్తుకుని చెబుతుంటారు.
కానీ వాటిని పట్టించుకునేది ఎంత మంది? ఆచరించేది మరెంత మంది? తాజాగా అభిమానుల అత్యుత్సాహం మరోసారి పెను ప్రమాదంలో పడేయ బోయింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించు కున్నారు. లేదంటే ఊహించని ప్రమాదమే చోటు చేసుకునేది. తల అజిత్ హీరోగా నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` ఈనెల 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడులోని తెంకాశీ పట్టణం లోని ఓ థియేటర్ వద్ద 285 అడుగుల భారీ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేసారు.
ఇనుముతో తయారు చేసిన పెన్సింగ్ గ్రిల్ ఏర్పాటు చేసి ఒక్కో భాగాన్ని పెడుతూ వెళ్తున్నారు. అయితే కాసేపటికి అజిత్ తల భాగం ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది. దీంతో చుట్టూ ఉన్న జనమంతా ఒక్కసారిగా పరుగులు తీసారు. అంతా సకాలంలో స్పందించి పక్కకు తప్పుకోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని తెలుస్తోంది.
తన పేరిట ఎలాంటి కటౌట్లు పెట్టొద్దని అజిత్ ఎప్పుడు చెబుతుంటాడు. కానీ ఆయన మాటలతో సంబంధం లేకుండా అభిమానులు వ్యవరిస్తున్నారని తాజా ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ ఘటనకు సంబంధించి అజిత్ ఎలా స్పందిస్తారో చూడాలి.