మూడోసారి ప్రమాదానికి గురైన అజిత్.. స్పీడులో కంట్రోల్ తప్పడంతో..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన సినిమాల కంటే కూడా ఈమధ్య రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తితో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 19 April 2025 4:14 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన సినిమాల కంటే కూడా ఈమధ్య రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తితో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బెల్జియంలోని ఇంటర్నేషనల్ రేసింగ్ ఈవెంట్ "సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్"లో పాల్గొన్న అజిత్ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ట్రాక్‌పై వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయింది. దీంతో కారు ట్రాక్ బయటకు దూసుకెళ్లింది.
అయితే ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటం అందరికీ ఊరట కలిగించింది. ఇది అజిత్‌కు ఎదురైన మూడవ రేసింగ్ ప్రమాదం కావడం గమనార్హం. జనవరిలో దుబాయ్‌లో జరిగిన "24హెచ్" కారు రేస్‌లో కూడా ఆయన కారు గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత స్పెయిన్‌లో ప్రాక్టీస్ రన్ సమయంలో మరో కారు వద్దకు రావడంతో అజిత్ తాను ఉండిన కారుతో ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నించగా పల్టీలు కొట్టింది.
తాజాగా బెల్జియంలో చోటు చేసుకున్న ప్రమాదం, వరుసగా అజిత్ ఇలాంటి ఘటనల్లో ఇరుక్కోవడం అభిమానులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. అయితే ఈ ప్రమాదాల్లో ఏ ఒక్కదాంట్లోనూ అజిత్‌కు గాయాలు కాకపోవడం చాలా గొప్ప విషయం. బెల్జియన్ ప్రమాదానికి సంబంధించిన వీడియోను అజిత్ టీమ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అందులో రేసింగ్ సమయంలో జరిగిన క్షణిక ఘటన స్పష్టంగా కనిపిస్తోంది.
అజిత్ మాత్రం అభిమానులకు సందేశంగా "రేసుల్లో ప్రమాదాలు సహజం.. కంగారు పడొద్దు" అంటూ తనదైన శైలిలో స్పందించినట్లు సమాచారం. ఇక సినిమా పరంగా చూస్తే అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా, అజిత్ మాస్ లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవడంతో ఆయన కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది.
రేసింగ్ ఒకవైపు, సినిమాలు మరోవైపు కొనసాగిస్తున్న అజిత్.. తన ప్యాషన్‌ను కూడా వదలకుండా ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయంగా మారింది. అభిమానులు మాత్రం రేసింగ్‌లో తక్కువ స్పీడ్‌తో వెళ్లాలని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ అజిత్ ప్రొఫెషనలిజం, డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజా ప్రమాదం తర్వాత అజిత్ మరికొంత సమయాన్ని విశ్రాంతి కోసం వెచ్చించనున్నట్లు సమాచారం. రాబోయే నెలల్లో తన తదుపరి సినిమా ప్రారంభించనున్నారని సమాచారం.
