Begin typing your search above and press return to search.

అప్పుడు అజిత్‌ తప్ప నాకెవ్వరూ ధైర్యం చెప్పలేదు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ నటించిన 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   10 April 2025 3:00 AM IST
అప్పుడు అజిత్‌ తప్ప నాకెవ్వరూ ధైర్యం చెప్పలేదు
X

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ నటించిన 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళనాడులో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యధిక స్క్రీన్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మాణం జరిగి ఈ తమిళ మూవీ తెలుగులోనూ మంచి బిజినెస్ చేసింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. సినిమా ఎప్పుడో రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రేపు రానుంది.

విభిన్నమైన టైటిల్‌తో దర్శకుడు అధిక్‌ రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. ఎప్పటిలాగే అజిత్‌ ఈ సినిమా ప్రమోషన్‌కి దూరంగా ఉంటున్నాడు. ప్రమోషన్ బాధ్యత మొత్తం దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్ తో పాటు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తీసుకున్నారు. ఇటీవల అధిక్ రవిచంద్రన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరో అజిత్‌ పై తనకు ఉన్న అభిమానం, గౌరవంను కనబర్చుతూ మాట్లాడాడు. ఈ సినిమాను అజిత్‌ పై ఉన్న అభిమానంతో అద్భుతంగా రూపొందించినట్లు చెబుతున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనే విశ్వాసంను ఆయన వ్యక్తం చేశాడు.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో నాపై నాకు చాలా నమ్మకం ఉండేది. కానీ 'అన్బానవన్‌ అసరాధవన్‌' సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఏం చేయాలో పాలు పోలేదు. ఇండస్ట్రీలో కొనసాగుతానా అనే అనుమానం కలిగింది. ఆ సమయంలో నాకంటూ ఎవరు లేరు, ఇండస్ట్రీలో నేను ఒంటరిని అనుకున్నాను. ఆ సమయంలోనే నాకు మద్దతుగా అజిత్ కుమార్‌ సర్‌ నిలిచారు. నాకు ధైర్యం చెప్పారు. తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన మద్దతు నా ఆలోచన పూర్తిగా మార్చేసింది. ఆయన సూచన మేరకు నేను సినిమాలు చేస్తూ వచ్చాను. ఆయన నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను అన్నాడు.

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి మరిన్ని విషయాలు నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా ఆయన ఇతరుల గురించి చెడుగా మాట్లాడడు. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక లెజెండ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా కోసం ఎంతో కష్టపడుతారు. ఆయన కోసం ఎన్నో రకాల కాస్ట్యూమ్స్‌ను రెడీ చేయించాం. ప్రతి ఒక్కదాన్ని ఓపికతో ధరించి ఎలా ఉందో మాకు చూపించేవాడు. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాకుండా గొప్ప వ్యక్తి గాను తాను ఆరాధిస్తాను అంటూ అధిక్ రవిచంద్రన్‌ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా హిట్‌ అయితే తప్పకుండా మరో సినిమా వీరి కాంబోలో రూపొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.