Begin typing your search above and press return to search.

కంటెంట్ లేకున్నా.. అజిత్ మాస్ పవర్ ఎలాంటిదో చూపించాడు!

ఇక తాజాగా విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మరోసారి అజిత్ ఫ్యాన్ బేస్ పవర్‌ను చాటింది.

By:  Tupaki Desk   |   11 April 2025 12:57 PM IST
Good Bad Ugly Collections
X

తల అజిత్ అంటే మాస్ ఫాలోయింగ్ కు బ్రాండ్ అని ఫ్యాన్స్ నిత్యం హడావుడి చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో యుద్ధాలు ఒక రేంజ్ లో అవుతుంటాయి. ఇక తాజాగా విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మరోసారి అజిత్ ఫ్యాన్ బేస్ పవర్‌ను చాటింది. సినిమా రిలీజ్‌కు ముందు బజ్ బాగానే ఉన్నా, ట్రైలర్ అంతగా కన్విన్స్ చేయలేదు. అయితే తొలి రోజు థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మాత్రం మిక్సడ్ టాక్ గానే నిలిచింది.

ఎలివేషన్స్ బాగున్నాయనీ.. కానీ కథలో ఎమోషనల్ కనెక్ట్ లేదన్న కామెంట్లు వెలువడ్డాయి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథలో తక్కువ బలమున్నా, అజిత్ చరిష్మా మాత్రం ఫుల్ స్వింగ్ లో కనిపించిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కథ గాడిలో నడవకపోయినా, మాస్ ఎలివేషన్లతో సినిమాలో కొన్ని బ్లాక్‌బస్టర్ మూమెంట్స్ ఉన్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సులు, బీజీ బ్యాక్‌డ్రాప్ లో అజిత్ స్టైల్ ప్రెజెంటేషన్ సినిమాకు ఓ బలంగా నిలిచింది.

కానీ అంతకంటే ఎక్కువగా పనిచేసింది మాత్రం అజిత్‌కు ఉన్న స్టార్ వాల్యూ. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తమిళనాడులో తొలి రోజు రూ.21.85 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది (excluding offline). ఇది అజిత్ కెరీర్‌లోనే కాదు, ఇటీవల తమిళ చిత్రసీమలో వచ్చిన హైయెస్ట్ ఓపెనింగ్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మిక్స్డ్ టాక్ నేపథ్యంలోనూ, ఇంత భారీ ఓపెనింగ్ రావడం ఆశ్చర్యంగా ఉందని అనలిస్ట్‌లు పేర్కొంటున్నారు.

ఈ మూవీకి భారీ ప్రమోషన్లు లేకపోయినా, ఓపెనింగ్ డే గ్రాస్ చూస్తే మాత్రం అజిత్ మాస్ మార్కెట్ మళ్లీ బిజిల్స్ కొడుతున్నట్టు అర్థమవుతోంది. ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈమధ్య విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రూ.20.66 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది. గతంలోనే రిలీజైన అజిత్ చిత్రం విదాముయర్చి 18.21 కోట్ల గ్రాస్‌తో మూడో స్థానంలో నిలిచింది.

మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వెట్టయన్ 14.66 కోట్లు, సూర్య కంగువా 8.49 కోట్ల గ్రాస్‌తో సరైన స్టార్ట్ ఇవ్వలేకపోయాయి. ఈ లెక్కన చూస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓపెనింగ్ కు పోటీ ఇచ్చే స్థాయిలో మరో మూవీ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గుడ్ బ్యాడ్ అగ్లీకి రివ్యూలు ఓ మోస్తరు స్థాయిలోనే వచ్చాయి. కథలో కొత్తదనం లేదు, ఎమోషన్లకు చోటు లేదు అనే విమర్శలు ఉండటంతో సినిమా చాలా కాలం నిలబడుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే మొదటి రోజు వసూళ్లు చూసిన తరువాత డే 2, డే 3 కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మౌత్ టాక్ బాగుండి ఉంటే సినిమా మొదటి వీకెండ్ వరకు పర్లేదు. కానీ నెగటివ్ టాక్ పెరిగితే, సోమవారం కలెక్షన్లు పెద్దగా నిలబడవని అంచనాలు ఉన్నాయి. మొత్తానికి గుడ్ బ్యాడ్ అగ్లీ మరోసారి అజిత్ మాస్ ఇమేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. కథ బలహీనంగా ఉన్నా కానీ హీరో అజిత్ ఫాలోయింగ్ సినిమాను కౌంటర్లో బీభత్సంగా లాక్కెళ్లింది. ఇకనైనా కంటెంట్ పైన దృష్టి పెడితే అజిత్‌కు సెకండ్ ఇన్నింగ్స్ బలంగా కుదరనుంది. లేదంటే ఈ ఒక్క మాస్ ఫాలోయింగ్‌తో ఎక్కువ రోజులు సక్సెస్ నిలబెట్టుకోవడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి.