అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ': ఈసారి బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంతంటే?
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ మరోసారి తన మాస్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు.
By: Tupaki Desk | 9 April 2025 3:51 PM ISTతమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ మరోసారి తన మాస్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం "గుడ్ బ్యాడ్ అగ్లీ" ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతుండగా, ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో మంచి హైప్ ఏర్పడింది. గతంలో వచ్చిన విదామయుర్చి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికి, ఈసారి మాత్రం అజిత్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ కొత్త ప్రాజెక్ట్ మీద పెట్టారు.
సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషన్ వీడియోలోనూ అజిత్ నటన, స్టైల్ స్పెషల్ హైలైట్‌గా నిలుస్తోంది. మాస్, యాక్షన్, స్టైలిష్ ట్రీట్మెంట్ అన్నింటినీ మిక్స్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కినట్లు కనిపిస్తోంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్‌ను మాస్ హీరోగా ప్రజెంట్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. థియేటర్లలో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని మసాలా ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నాయనేది ఫ్యాన్స్ విశ్వాసం.
ఇక బిజినెస్ పరంగా చూస్తే, అజిత్ మార్కెట్ సత్తా ఏంటో ఈ సినిమా చూపించింది. తమిళనాడులోనే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు దాదాపు ₹75 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్ అంచనా ₹4.5 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తం వరల్డ్ వైడ్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ₹114 కోట్ల బిజినెస్ చేసింది.
ఇప్పటికే విడుదలైన అజిత్ మూవీ విదామయుర్చి ₹91 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసినా క్లీన్ హిట్ అవ్వలేకపోయింది. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీకు అయితే 116 కోట్ల షేర్ మార్క్ దాటి గ్రాస్ పరంగా కనీసం ₹220 కోట్లు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. టాక్ బాగుండి, ఓపెనింగ్స్ పవర్ఫుల్ గా వస్తే తప్పకుండా ఈ మార్క్ అందుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడులో అజిత్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఈ సినిమాకు బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక ట్రేడ్ సర్కిల్స్ ఈ సినిమాపై మంచి ఆశలే పెట్టుకున్నాయి. ఆడియన్స్ నుంచి మొదటి వీకెండ్‌లో మంచి రెస్పాన్స్ వస్తే సినిమా లాంగ్ రన్‌లో వసూళ్ల పరంగా బాగానే నిలవొచ్చు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ఇష్టం పడే యాక్షన్, డైలాగ్స్, టెంపో ఇలా అన్నీ సినిమాకు ప్లస్ అవుతాయని అంటున్నారు. తెలుగు మార్కెట్‌లో కూడా మంచి ప్రమోషన్ చేస్తే ఓవరాల్ గా హిట్ సాధించే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈసారి అజిత్‌కు గుడ్ బ్యాడ్ అగ్లీతో తగిన హిట్ వస్తుందా అన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్ బాగుంటే మాత్రం ఇది ఈ సమ్మర్ సీజన్‌లో అజిత్‌కి బిగ్ సక్సెస్ తీసుకురాగలదని చెప్పవచ్చు.
