Begin typing your search above and press return to search.

నాగార్జున కు ఖాళీలేదు హీరోగా చేయ్ అని అవ‌మానం!

తాజాగా ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన కొత్త‌లో ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారో రివీల్ చేసారు. 'ఓ మూవీ సంస్థ‌లో ఓ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉండేవాడు.

By:  Tupaki Desk   |   13 May 2024 6:10 AM GMT
నాగార్జున కు ఖాళీలేదు హీరోగా చేయ్ అని అవ‌మానం!
X

ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక్క‌డ అవ‌మానాలు త‌ప్ప‌వు. నువ్వు హీరో ఏంటి? నువ్వు న‌టుడివా? అంటూ ఎంతో మంది హేళ‌న చేస్తారు. అవ‌మానిస్తారు. అన్నింటిని భ‌రించి నిల‌బ‌డితేనే రేపు అనే నీ రోజు ఒక‌టి వ‌స్తుంది. ఆ రోజు అవ‌మానించిన వారే ఎర్ర తివాచీ వేసి మ‌రీ ఆహ్వానిస్తారు. నీ డేట్లు కోసం ఎదురు చూస్తారు.

మొగ్గాస్టార్ చిరంజీవి..బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ నుంచి ఎంతో మంది అలా ఎదిగిన వారే. అందుకే అంత‌ గొప్ప వాళ్ల‌గా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా ..సూప‌ర్ హీరోలుగా నిల‌బ‌ట్టారు. వాళ్లిద్ద‌రు ఎంతో మందికి స్పూర్తి గానూ నిలిచారు. తాజాగా అజ‌య్ ఘోష్ కూడా ఇండ‌స్ట్రీలో అలా ఎదిగిన న‌టుడేన‌ని తెలుస్తుంది. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో అజ‌య్ ఘోష్ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. పాజిటివ్ రోల్ అయినా..నెగిటివ్ రోల్ అయినా త‌న‌దైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంటాడు.

ముఖ్యంగా ఆయ‌న పేరు ఎత్తితే వెంట‌నే క్లీన్ హెడ్ గుర్తొస్తుంది. ఇండ‌స్ట్రీలో గుండుతో బ‌య‌ట తిరిగే న‌టుడు ఆయ‌న ఒక్క‌డే. 'ప్ర‌స్థానం'తో కెరీర్ మొద‌లు పెట్టి మొన్న‌టి 'పుష్ప' వ‌ర‌కూ తానో సంచ‌ల‌నం అని నిరూపించారు. త‌మిళ్‌..క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించారు. తాజాగా ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన కొత్త‌లో ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారో రివీల్ చేసారు. 'ఓ మూవీ సంస్థ‌లో ఓ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉండేవాడు. ఆయన్ని ఓసారి కలవమని నా మిత్రుడు చెబితే యూస్‌ఫగూడ నుంచి భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌ దగ్గర ఉన్న వాళ్ల ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లా.

అప్పట్లో నా అవతారం వేరేగా ఉండేది. లూజు ఫ్యాంటు, బట్టతల, రబ్బరు చెప్పులు. చెంచురెడ్డిని కలవగానే ఆయన ఏ చిరాకులో ఉన్నాడో ఏమో... 'ఆయన చెప్పగానే నీకు వేషం ఇచ్చేస్తారా? అద్దంలో నీ ముఖం చూసుకున్నావా? నాగార్జునగారికి ఖాళీ లేదంట. పోనీ నువ్వు చేస్తావా హీరోగా...' అని వేళాకోళంగా మాట్లాడాడు. 'ఏమిటిలా మాట్లాడుతున్నాడు? అని అప్పుడు బాధ కలిగినా... నాలాంటి వాళ్లు రోజూ చాలా మంది వస్తుంటారు కనుక అతనికున్న టెన్షన్‌లో అలా అని ఉంటాడని సరిపెట్టుకున్నా. ఇలా అవమానాలు సహిస్తూ, వేషాల కోసం తిరిగి తిరిగి విసుగు పుట్టేది. ఆ రోజుల్లో యాపిల్‌ పండు కొనుక్కొని తినాలనే కోరిక చాలా బలంగా ఉండేది.

మనసు చంపుకోలేక ఓ రోజు యూస్‌ఫగూడ చెక్‌పో్‌స్టలో ఉన్న షాప్‌లో యాపిల్‌ రేటు ఎంతో అడిగా. 30 రూపాయలో, 40 రూపాయలో చెప్పాడు. అంత డబ్బు ఉంటే నాకు రెండు రోజులు గడుస్తాయి కదా అనుకొని... తక్కువకి రాదా? అని అడిగాను. నీది కొనే మొహమేనా అన్నట్లు నా వంక చూసి ఛలో... ఛలో అన్నాడు షాపతను. ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నా... డబ్బు విలువ నాకు తెలుసు. అందుకే ఖర్చు పెట్టడానికి వెనకా ముందు ఆలోచిస్తుంటా' అని అన్నారు.