Begin typing your search above and press return to search.

థియేట‌ర్లో విసిరేసిన డ‌బ్బులు ఏరుకున్న హీరో

ఈరోజు పరిశ్రమలో తన 32వ వార్షికోత్సవం సందర్భంగా, అజయ్ తన తొలి సినిమా అనుభ‌వాల‌ గురించి మాట్లాడుతున్న త్రోబాక్ వీడియోను విడుద‌ల చేసాడు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 4:08 PM GMT
థియేట‌ర్లో విసిరేసిన డ‌బ్బులు ఏరుకున్న హీరో
X

ఖాన్‌ల త్ర‌యానికి ధీటుగా హిందీ చిత్ర‌సీమ‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌త ఉంద‌ని నిరూపించాడు అజ‌య్ దేవ‌గ‌న్. యాక్ష‌న్ స్టార్ గా అత‌డికి ఉన్న ఇమేజ్ అసాధార‌ణ‌మైన‌ది. బాలీవుడ్ లో మూడు ద‌శాబ్ధాల కెరీర్ ని సునాయాసంగా న‌డిపించాడు. ఇప్ప‌టికీ ఎదురేలేని స్టార్ హీరోగా కొన‌సాగుతున్నాడు. అత‌డు ఇటీవ‌ల ఆర్.ఆర్.ఆర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ సినిమాలోను న‌టించాడు. ఇప్ప‌టికీ అత‌డు న‌టించిన మొద‌టి సినిమా జ్ఞాప‌కాల‌ను తుడిచేయ‌లేదు. అంత‌గా మొద‌టి సినిమా ప్ర‌భావం అత‌డిపై ప‌ని చేసింది. అజయ్ దేవగన్ న‌టించిన తొలి చిత్రం 'ఫూల్ ఔర్ కాంటే' థియేటర్‌లోకి రిలీజైన‌ నాటి అనుభ‌వాన్ని ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేదు అజ‌య్ దేవ‌గ‌న్. అప్ప‌ట్లో స్క్రీన్ పైకి థియేట‌ర్లోని ప్రేక్ష‌కులు ఎలా డబ్బు విసిరారో గుర్తు చేసుకున్నాడు. ఈ రోజుతో తనకు సినీరంగంలో 32 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సంద‌ర్భంగా నాటి అనుభ‌వాన్ని అభిమానుల‌కు షేర్ చేసాడు.

'ఫూల్ ఔర్ కాంటే'లో అజయ్ దేవగన్ ఐకానిక్ ఆరంగేట్రం ఎంట్రీ సన్నివేశాన్ని అభిమానులు మర్చిపోగలరా?.. ఇది హిందీ సినిమాల్లో అత్యుత్తమ హీరోయిక్ ఎంట్రీ సన్నివేశాలలో ఒకటి. యాక్షన్ స్టార్‌గా దేవ‌గ‌న్ పేరు మార్మోగేలా చేసింది ఈ సీన్. రెండు బైక్‌లపై రెండు కాళ్లూ ఉంచి ఎంతో స్టైలిష్ గా అత‌డు వీధుల్లో ర్యాలీ చేస్తాడు. ఇలాంటి సీన్ భారతీయ సినిమా తెరపై ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అది జరిగి 32 సంవత్సరాలు పూర్త‌యింది. ఈ చిత్రం 22 నవంబర్ 1991న విడుదలైంది. ఆ తర్వాత అజయ్ దేవ‌గ‌న్ హీరోగా చాలా ఎత్తుకు ఎదిగాడు.

ఈరోజు పరిశ్రమలో తన 32వ వార్షికోత్సవం సందర్భంగా, అజయ్ తన తొలి సినిమా అనుభ‌వాల‌ గురించి మాట్లాడుతున్న త్రోబాక్ వీడియోను విడుద‌ల చేసాడు. అప్ప‌ట్లో గెలాక్సీలో ఈ సినిమా ప్రీమియర్ షో వేశామని, అయితే జెమినీలో తన సినిమాకి సంబంధించిన మరో షో ఉందని చెప్పాడు. టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. అజ‌య్ ప్రొజెక్టర్ గది తలుపు నుండి బయటకు వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడు. అప్పుడే 'కాలేజ్ కి లడ్కీ' అనే పాట మొదలైంది. థియేట‌ర్ల‌లో విజిల్స్ తో హుషారెక్కిన‌ జనాలు తెరపైకి డబ్బులు విసరడం మొదలుపెట్టారు. వెంటనే ఆ కాయిన్స్ తన తలపై కొట్టాయ‌ని అజయ్ గుర్తు చేసుకున్నాడు. కాబట్టి వాటిని ఫ్రేమ్ చేసి, ఆ ఫ్రేమ్ ని ఇప్పటికీ ఇంట్లోనే ఉంచాడ‌ట‌. అది అతనికి చాలా ఎగ్జ‌యిట్ చేసే జ్ఞాపకం. దేవ‌గ‌న్ 32వ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులు ప్రేమను కురిపించి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత, దర్శకుడు అభిషేక్ కపూర్ మాట్లాడుతూ.. టాప్ క్లాస్.. వాట్ ఎ స్మాష్ హిట్.. అని దేవ‌గ‌న్ తొలి సినిమాని ప్ర‌శంసించాడు.

ప్రతి స్కూల్ కాలేజీ ఈ సినిమా పాటలు పాడుకున్నార‌ని ఒక అభిమాని ప్ర‌శంసించారు. దేవ‌గ‌న్ ప్రజాదరణ సంవత్సరాలుగా మరింత పెరుగుతూనే ఉంది. అజయ్ ప్రస్తుతం 'సింగం ఎగైన్' సినిమా చేస్తున్నాడు. నిన్న సినిమా నుండి అతని ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుద‌ల చేయ‌గా చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ''అతడు శక్తిమంతుడు. అతడు శక్తి. అతడు డేంజర్. అతడు బలం. సింగం మళ్లీ గర్జిస్తాడు!'' అనేది ఈ పోస్ట‌ర్ సందేశం. 'సింగమ్ ఎగైన్' చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నారు.