రైడ్ 2: వన్ ప్లస్ వన్ ఆఫర్ వర్కవుటవుతుందా?
ఇప్పుడు మరో హాట్ గాళ్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఐటమ్ నంబర్ ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ దీనిని కన్ఫామ్ చేసింది.
By: Tupaki Desk | 22 April 2025 5:28 PM ISTబాలీవుడ్ లో అజయ్ దేవగన్ లాంటి స్టార్ నటిస్తున్న సినిమా అనగానే అంతో ఇంతో బజ్ ఉంటుంది. ఇంతకుముందు అజయ్ నటించిన రైడ్ కి సీక్వెల్ గా వస్తున్న `రైడ్ 2` గురించి ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఐఆర్ఎస్ అధికారి పాత్రను దేవగన్ తిరిగి పోషించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సంఘంలో వైట్ కాలర్ నేరగాళ్ల భరతం పట్టే అధికారిగా కనిపించనున్నాడు.
అయితే ఇలాంటి సీరియస్ డ్రామాలో రిలీఫ్ కావాలంటే మధ్యలో రొమాన్స్, కామెడీ, ఐటమ్ పాటలు తప్పనిసరిగా అవసరం. అందుకేనేమో ఇప్పటికే దర్శకనిర్మాతలు తమన్నా, జాక్విలిన్ లాంటి అందాల భామలతో ఐటమ్ నంబర్లు చేయించి వాటిని ప్రచారం కోసం జనం మీదికి వదులుతున్నారు. ఇంతకుముందు తమన్నా ఐటమ్ పాట నషా విడుదలైనా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మిల్కీ బ్యూటీ గతంలో చార్ట్ బస్టర్ సాంగ్స్ తో చర్చలలో నిలిచినా కానీ, ఈసారి ఎందుకనో వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు మరో హాట్ గాళ్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఐటమ్ నంబర్ ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ దీనిని కన్ఫామ్ చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత తమన్నా ప్రత్యేక గీతం మెప్పించలేదు. అందుకే ఇప్పుడు రాబోతున్న ప్రత్యేక గీతం సినిమాకి కావాల్సిన హైప్ ని తెస్తుందా? అన్న చర్చ సాగుతోంది. అయితే ఐటమ్ గాళ్స్ తో వరుసగా ప్రత్యేక గీతాల్ని ప్రదర్శిస్తున్నారు అనగానే, ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చిత్రబృందం ఏ స్థాయిలో ప్లాన్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. కానీ సినిమాలో ఐటమ్ పాటల్ని మించి కథ కంటెంట్ చాలా ముఖ్యం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో జనాల్ని సీట్ అంచుకు జారేలా థ్రిల్లర్ ను చూపించాలి. మేకర్స్ రైడ్ 2 విషయంలో ఆ పని చేసారా లేదా చూడాలి.
