Begin typing your search above and press return to search.

OTT పారితోషికంలో నంబ‌ర్ వ‌న్ స్టార్

ఓటీటీలు గేమ్ ఛేంజ‌ర్‌లుగా మారాయి. డిజిట‌ల్ రంగం ఈరోజు కొత్త నిర్వ‌చ‌నం ఇస్తోంది. ఇక్క‌డ స్టార్లు ఉద్భ‌విస్తున్నారు. స‌రైన విజ‌యాలు ద‌క్క‌ని కొంద‌రు పెద్ద స్టార్ల కెరీర్ గేమ్ అమాంతం మారుతోంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 9:35 AM IST
OTT పారితోషికంలో నంబ‌ర్ వ‌న్ స్టార్
X

ఓటీటీలు గేమ్ ఛేంజ‌ర్‌లుగా మారాయి. డిజిట‌ల్ రంగం ఈరోజు కొత్త నిర్వ‌చ‌నం ఇస్తోంది. ఇక్క‌డ స్టార్లు ఉద్భ‌విస్తున్నారు. స‌రైన విజ‌యాలు ద‌క్క‌ని కొంద‌రు పెద్ద స్టార్ల కెరీర్ గేమ్ అమాంతం మారుతోంది. పారితోషికాల రేంజ్ కూడా ఊహించ‌నివిధంగా ఉంది. ఇటీవ‌ల ఏ లిస్ట‌ర్ స్టార్లు కూడా ఓటీటీలో రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సైఫ్ అలీఖాన్, అజ‌య్ దేవ‌గ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్, షాహిద్ కపూర్, వివేక్ ఒబెరాయ్ స‌హా చాలా మంది పెద్ద స్టార్లు ఓటీటీల‌లో త‌మ‌ను తాము ఎలివేట్ చేసుకునేందుకు పోటీ ప‌డుతున్నారు.

ఇది ఊహించ‌ని కొత్త ట్రెండ్. ఓటీటీలు గేమ్ ఛేంజ‌ర్ అనేందుకు ఇంకా చాలా కార‌ణాలు ఉన్నాయి. అయితే ఇంత మంది పెద్ద స్టార్ల‌లో ఎవ‌రు ఎక్కువ పారితోషికం అందుకున్నారు? అంటే.. క‌చ్ఛితంగా యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ పేరు వినిపిస్తోంది. దేవ‌గ‌న్ 'రుద్ర- ఎడ్జ్ ఆప్ డార్క్ నెస్' సిరీస్‌లో కాప్ పాత్ర‌లో న‌టించినందుకు ఏకంగా 125 కోట్ల పారితోషికం వ‌సూలు చేసారు. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 18 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇది OTT షోల‌లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం. ఖాన్ ల త్ర‌యం ఒక్కో సినిమాకు 100 కోట్లు అంత‌కంటే త‌క్కువ వ‌సూలు చేస్తుంటే, అజ‌య్ దేవ‌గ‌న్ అంత‌కుమించి వ‌సూలు చేసాడు.

అయితే ఒక ఓటీటీ సిరీస్ కోసం పని చేయ‌డం అంత సులువేమీ కాదు. దాదాపు రెండు ఫీచ‌ర్ సినిమాల కోసం ఎంత‌గా శ్ర‌మించాలో అంత‌గా శ్ర‌మించారు అజ‌య్ దేవ‌గ‌న్. రుద్ర కోసం కేటాయించిన స‌మ‌యంలో అత‌డు రెండు ఫీచ‌ర్‌ సినిమాల‌ను పూర్తి చేయ‌గ‌ల‌డు. ఓటీటీ సిరీస్ ప్ర‌మోష‌న్స్ కోసం స‌మ‌యం కేటాయించ‌డం కూడా ఒప్పందంలో భాగంగా ఉంటుంది. అందువ‌ల్ల ఎక్కువ స‌మ‌యం కేటాయించి శ్ర‌మించాలి. ఇక ఓటీటీ రంగంలో త‌క్కువ పారితోషికం అందుకున్న‌ది ఎవ‌రు? అంటే.. శాక్రెడ్ గేమ్స్ తో ఓటీటీ రంగంలో కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టిన సైఫ్ ఖాన్. అత‌డు ఈ సిరీస్ కోసం 20 కోట్ల లోపు అందుకున్నాడు. షాహిద్ ఫ‌ర్జీ కోసం చాలా పెద్ద మొత్తం అందుకున్నాడు. పంకజ్ త్రిపాఠి, మనోజ్ బాజ్‌పేయి, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి ఇతర బాలీవుడ్ తారలు కూడా భారతదేశంలోని అత్యంత ధనవంతులైన ఓటీటీ తారల జాబితాలో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఓటీటీల ఎదుగుద‌ల స్టార్ల భ‌విత‌వ్యాన్ని అమాంతం మార్చేసింద‌న‌డంలో సందేహం లేదు.

అజయ్ దేవ‌గ‌న్ కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. అత‌డు న‌టించిన చివరి చిత్రం 'రైడ్ 2' పెద్ద విజ‌యం సాధించింది. త‌దుప‌రి 'సన్ ఆఫ్ సర్దార్ 2', 'దే దే ప్యార్ దే 2' , 'ధమాల్ 4 'వంటి ప్రాజెక్టులు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.