థ్రిల్లర్ సీక్వెల్.. అజయ్ భూపతి ఈసారి ఏం తీస్తాడో..
టాలీవుడ్ లో ప్రత్యేకమైన కథలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.
By: Tupaki Desk | 4 May 2026 12:29 PM ISTటాలీవుడ్ లో ప్రత్యేకమైన కథలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తో సెన్సేషన్ సృష్టించిన ఆయన, ఆ తర్వాత మహా సముద్రం ప్రాజెక్టుతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయారు. అయితే మూడో ప్రయత్నంగా తీసిన మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. అందరినీ ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగించే దిశగా అజయ్ భూపతి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ శ్రీనివాస మంగాపురం. ఆ చిత్రంతో ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయ కృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రాషా థడానీ నటిస్తున్న ఆ సినిమా ఇప్పటికే టీజర్ తో ఆసక్తి రేకెత్తించింది. జూలైలో విడుదలకు సిద్ధమవుతున్న ఆ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, అజయ్ భూపతి దృష్టి ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్ పై పడింది. అదే మంగళవారం మూవీ సీక్వెల్. మొదటి భాగం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో, రెండో పార్ట్ పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ పోషించిన పాత్రకు వచ్చిన రెస్పాన్స్, సీక్వెల్ కు బలం చేకూర్చింది. అయితే మంగళవారం 2 కోసం అజయ్ భూపతి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
మొదటి భాగం కంటే మరింత లోతైన సైకాలజికల్ ఎలిమెంట్స్ తో కథను రూపొందించారనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో కథలో థ్రిల్లింగ్ అంశాలు పెంచి, ప్రేక్షకులను మరింత ఉత్కంఠకు గురి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ కు నిర్మాతగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రంగంలోకి దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది. తన బ్యానర్ యువసుధా ఆర్ట్స్ ద్వారా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్న కొరటాల, ఆ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు నిర్మాత మిక్కిలినేని సుధాకర్ కూడా చిత్ర నిర్మాణంలో భాగమవుతారని టాక్.
క్యాస్టింగ్ విషయానికి వస్తే, మరోసారి పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్‌లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె పాత్రనే కథకు మెయిన్ గా తీసుకుని సీక్వెల్ ను నిర్మిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మిగతా నటీనటుల ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక షూటింగ్ విషయానికి వస్తే, ఆగస్టు నుంచి మంగళవారం 2 మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
శ్రీనివాస మంగాపురం మూవీ పూర్తయ్యాక అజయ్ ఆ ప్రాజెక్ట్ పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, అజయ్ భూపతి కెరీర్ లో మంగళవారం కీలక మలుపు తిప్పిన చిత్రం. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్ తీసుకురావడం ద్వారా తన రేంజ్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కథ, కథనం గట్టిగా ఉంటే మంగళవారం 2 కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.
