హిట్ పడినా పట్టించుకోరేం..?
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకీ భార్యగా భాగ్యం పాత్రలో ఐశ్వర్య అదరగొట్టేసింది. ఆమె ఎనర్జిటిక్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
By: Tupaki Desk | 10 May 2025 3:30 PMసినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత టాలెంట్‌తోనే ఎదిగింది ఐశ్వర్య రాజేష్. తెలుగమ్మాయి కావడం, కలర్ తక్కువ ఉండటంతో కెరీర్ ఆరంభంలో చాలా స్రగ్గుల్స్ ఫేస్ చేసింది. సొంత ఇండస్ట్రీలో అవకాశాలు రాక కోలీవుడ్ బాట పట్టింది. గ్లామర్ షో కన్నా నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తమిళనాట స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. అక్కడ సంపాదించుకున్న క్రేజ్ తోనే తెలుగు, మలయాళం భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది.
తెలుగులో ఐశ్వర్య తొలి చిత్రం ' కౌసల్య కృష్ణమూర్తి '. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ' మిస్ మ్యాచ్ ', ' వరల్డ్ ఫేమస్ లవర్ ', ' టక్ జగదీష్ ', ' రిపబ్లిక్ ' వంటి సినిమాల్లో ఐశ్వర్య నటించింది. కానీ ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఐశ్వర్య రాజేష్ మళ్లీ పొరుగు భాషా చిత్రాలపైనే ఆధాపడింది. తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలే కాకుండా ట్రెండ్ కు తగ్గుట్లుగా వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తూ దూసుకుపోతుంది.
అలాంటి తరుణంలోనే టాలీవుడ్ నుంచి ఐశ్వర్యకు పిలుపొచ్చింది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో మూవీ ' సంక్రాంతి వస్తున్నాం 'లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుంది. 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అటు పండుగ సమయంలో విడుదలై, సంక్రాంతి విన్నర్ గానూ నిలిచింది.
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకీ భార్యగా భాగ్యం పాత్రలో ఐశ్వర్య అదరగొట్టేసింది. ఆమె ఎనర్జిటిక్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి వస్తున్నాం మూవీతో తెలుగులో ఐశ్వర్య ఓ బిగ్ హిట్ ను అందుకుంది. అయినప్పటికీ టాలీవుడ్ ఆమెను పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేతిలో దాదాపు అర డజన్ కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ, అందులో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. కథల ఎంపికలో సెలక్టివ్ గా ఉండే ఐశ్వర్యకు టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదా? లేక వచ్చిన ఆఫర్లు నచ్చడం లేదా? అన్నది తెలియాల్సి ఉంది.