తల్లిగా నటించడం ఒక ప్రైడ్
తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్య రాజేష్.
By: Tupaki Desk | 7 July 2025 11:15 AM ISTతెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్య రాజేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఐశ్వర్య ఆ సినిమాలో వెంకటేష్ కు భార్యగా, నలుగురు పిల్లల తల్లిగా నటించి మెప్పించారు. తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలకు ఐశ్వర్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆ సినిమాలోని తన పాత్ర గురించి ఐశ్వర్య మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టీరియోటైప్ క్యారెక్టర్ లను చేయడానికి తాను మొహమాటపడనని, కెరీర్లో తన క్యారెక్టర్ సెలక్షన్ గురించి, తాను ఎలాంటి పాత్రలను చేయాలనుకుంటున్నారో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య నలుగురు పిల్లల తల్లిగా నటించిన సంగతి తెలిసిందే.
ఐశ్వర్య వయసేమీ మరీ ఎక్కువ కాదు. ఈ ఏజ్ లో నలుగురు పిల్లల తల్లిగా నటిస్తే తర్వాత ఆఫర్లకు ఇబ్బందవుతేదేమోనని చాలా మంది ఇలాంటి పాత్రలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఐశ్వర్య మాత్రం ఆ పాత్రను ఒప్పుకోవడమే కాకుండా ఆ పాత్రలో ఒదిగిపోయి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. యాక్టర్లకు వయసు పరిమితి ఉండదని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
మంచి నటిగా రాణించాలంటే ఎలాంటి క్యారెక్టర్‌నైనా చేయాల్సిందేనని, ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి వయసు అడ్డం కాదని, తాను చాలా సినిమాల్లో తల్లిగా నటించానని ఐశ్వర్య పేర్కొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా నటించిన తాను, ఒకవేళ ఆ సినిమాకు పార్ట్2 ఉంటే తనకు ఆరుగురు పిల్లలుంటారని డైరెక్టర్ అనిల్ తనతో చెప్పారని తానా సభల్లో ఐశ్వర్య వెల్లడించారు. ఐశ్వర్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
