అనిల్ కొత్త కథ విన్నా.. బ్లాక్‌బస్టర్ పక్కా!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ఐశ్వర్యా రాజేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి
By: Sravani Lakshmi Srungarapu | 13 Jun 2026 8:00 PM ISTసంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ఐశ్వర్యా రాజేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తిరువీర్‌తో కలిసి నటిస్తున్న ఓ సుకుమారి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె, తన కెరీర్, అనిల్ రావిపూడితో ఉన్న అనుబంధం, ఫీమేల్ సెంట్రిక్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అనిల్ రావిపూడి కొత్త సినిమాలో మీరు ఎందుకు లేరని ప్రశ్నించగా, ఐశ్వర్యా రాజేష్ నవ్వుతూ మీరు ఆయనకు ఫోన్ చేసి వెంటనే అడగండంటూ సరదాగా సమాధానమిచ్చారు. అయితే ఆ తర్వాత అనిల్‌పై తనకు ఉన్న గౌరవాన్ని ఆమె స్పష్టంగా వ్యక్తం చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయంలో భాగ్యం పాత్ర కీలకమని ప్రేక్షకులు భావించినప్పటికీ, ఆ విజయాన్ని అనిల్ రావిపూడి అతని ఖాతాలో వేసుకోకుండా ఎప్పుడూ తనను ప్రశంసిస్తుంటారని ఆమె చెప్పారు. ఏ అవార్డు కార్యక్రమానికి వెళ్లినా ఈ సినిమా గురించి ప్రస్తావన వస్తే, ఈ అవార్డు ఐశ్వర్యాకు ఇవ్వాలని అనిల్ చెప్పడం తనకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం2 గురించి కూడా ఆమె స్పందించారు. ఆ ప్రాజెక్ట్‌కు ఇంకా కథ పూర్తిగా సిద్ధం కాలేదేమోనని భావిస్తున్నానని, ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని తెలిపారు. ఆ సినిమా స్టోరీ లైన్ తాను కూడా విన్నానని, అది అద్భుతంగా ఉందని, మరో బ్లాక్‌బస్టర్ అవడం ఖాయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ లో అనిల్‌తో మరోసారి పనిచేసే అవకాశం కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఐశ్వర్యా వెల్లడించారు.
ఇదే కార్యక్రమంలో గత కొంతకాలంగా తాను ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నాననే అభిప్రాయంపై కూడా ఆమె స్పందించారు. తాను ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేసి రెండేళ్లు దాటిపోయిందని, వరుసగా అలాంటి సినిమాలే చేస్తున్నాననేది సరైన అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాల గురించి మాట్లాడిన ఐశ్వర్యా, అలాంటి సినిమాలు చేయడం అంత సులభం కాదని అన్నారు. సాధారణ కమర్షియల్ సినిమాల్లో బాధ్యత అందరి మీద ఉంటుందని, కానీ హీరోయిన్ ప్రధానంగా సాగే సినిమాల్లో మొత్తం భారం హీరోయిన్ పైనే పడుతుందని చెప్పారు. సినిమా రిజల్ట్ కాస్త అటూ ఇటూ అయినా, మొదటగా ప్రశ్నలు ఎదుర్కొనేది ప్రధాన పాత్రధారేనని పేర్కొన్నారు. అందుకే అలాంటి కథలను ఎంపిక చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి వస్తుందని వెల్లడించారు.
సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సక్సెస్ తర్వాత వెంటనే సినిమాలు చేయకపోవడానికి కూడా ఇదే కారణమని ఆమె వివరించారు. ఆ సినిమా తర్వాత ప్రేక్షకుల అంచనాలు పెరిగాయని, అందుకే ఏ కథ పడితే ఆ కథ చేయకుండా మంచి కథలు, బలమైన పాత్రల కోసం వేచి చూశానని చెప్పారు. ఆల్రెడీ రెండు మూడు ఫీమేల్ సెంట్రిక్ స్క్రిప్ట్‌లను ఫైనల్ చేశానని, త్వరలో వాటి గురించి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. మొత్తంగా చూస్తే, ఐశ్వర్యా రాజేష్ తన కెరీర్‌ను తొందరపాటుగా కాకుండా ఆచితూచి ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయంతో ఉన్నట్లు ఆమె తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టాలనే ఆసక్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం అభిమానుల్లో కొత్త అంచనాలకు దారితీసింది.
