పరాయిదానిలా ఫీలవ్వలేదంటూ తంబీల మనసు దోచిన ఐష్!
ప్రతిష్టాత్మకమైన కాన్ చలనచిత్రోత్సవం 2026 వేడుకల్లో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై చాటడంలో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పుడూ ముందుంటారు.
By: M Prashanth | 24 May 2026 10:46 AM ISTప్రతిష్టాత్మకమైన కాన్ చలనచిత్రోత్సవం 2026 వేడుకల్లో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై చాటడంలో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పుడూ ముందుంటారు. ఏటా తన అద్భుతమైన ఫ్యాషన్ శైలితో రెడ్ కార్పెట్‌పై మెరిసే ఐశ్వర్య ఈసారి కూడా ఫ్యాషన్ కోణంతో పాటు సినీ ప్రయాణంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల సందర్భంగా ఐశ్వర్యారాయ్ సినీ కెరీర్ ప్రారంభ రోజులను, ముఖ్యంగా కోలీవుడ్ తో తనకున్న అనుబంధాన్ని ఎంతో హుందాగా గుర్తు చేసుకున్నారు.
తాను కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఎప్పుడూ అవుట్‌సైడర్ గా భావించ లేదన్నారు. కర్ణాటకకు చెందిన మోడల్‌గా, ముంబైలో స్థిరపడినా? భాష తెలియకపోయినా తమిళ ఇండస్ట్రీ ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికిందని హర్షం వ్యక్తం చేశారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ చిత్రం `ఇరువర్` (ఇద్దరు) తో వెండితెరకు పరిచయమైన తనకు మొదటి అడుగే ఎన్నో వృత్తిపరమైన జీవిత పాఠాలను నేర్పిందన్నారు. తమిళ ఇండస్ట్రీలోని క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత తనను ఓ నటిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.
మణిరత్నం వంటి లెజెండరీ దర్శకుడి మార్గదర్శకత్వంలో కెరీర్ ప్రారంభించడం అదృష్టమని అటుపై శంకర్ దర్శకత్వంలో చేసిన `జీన్స్` సినిమా తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందని గుర్తుచేసుకున్నారు. దక్షిణాది దర్శకుల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు అప్పట్లోనే అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేవని కొనియాడారు. సాధారణంగా ఇతర భాషల నుండి వచ్చే నటీనటులకు భాషా పరమైన అడ్డంకులు, సరికొత్త వాతావరణం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంటుంది. కానీ తమిళ చిత్రసీమ ప్రతిభను మాత్రమే చూసి గౌరవిస్తుందని భాషతో సంబంధం లేకుండా తనను తమ సొంత నటిగా ఓన్ చేసుకుందని చెప్పుకొచ్చారు.
కళకు ప్రాంతీయ సరిహద్దులు లేవని నిరూపించడంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుందని ఆ ఆదరణ , మద్దతు వల్లే తాను బాలీవుడ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ధైర్యంగా రాణించగలిగానని ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఐశ్వర్య రాయ్ దక్షిణాదితో ఉన్న బంధాన్ని ఎప్పుడూ తెంచుకోలేదు. ఇటీవల మణిరత్నం ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం `పొన్నియిన్ సెల్వన్` లో నందిని పాత్రలో అమ్మడి నటన నేటి తరం ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసింది.
`ఇరువర్` నుండి మొదలైన ప్రయాణం నేటికీ అంతే గౌరవంతో, నమ్మకంతో సాగుతుండటం ఐశ్వర్య అంకితభావానికి, దక్షిణాది చిత్రాల పట్ల ఆమెకున్న అపారమైన గౌరవానికి నిదర్శనం. ఐశ్వర్య రాయ్ విజయాల వెనుక ఉన్న పునాదులను, ఆనాటి తమిళ సినిమా జ్ఞాపకాలను గౌరవంగా గుర్తుచేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
