కేన్స్ 2025లో ఇద్దరు భారతీయ నటీమణులు వీళ్లే
ప్రతియేటా ఐశ్వర్యారాయ్ తో పాటు కొందరు భారతీయ కథానాయికలకు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కుతోంది. ఈసారి ఆ అవకాశం ట్యాలెంటెడ్ ఆలియా భట్ ని వరించింది.
By: Tupaki Desk | 8 May 2025 12:21 PMకేన్స్ ఫిలింఫెస్టివల్ ఐకన్ గా ఐశ్వర్యారాయ్ కు ఉన్న గుర్తింపు గురించి తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రతియేటా కేన్స్ లో మెరుపులు మెరిపిస్తున్న ఐష్ ఎవర్ గ్రీన్ ఇండియన్ స్టార్ గా, ఎదురేలేని ఫ్యాషనిస్టాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతియేటా ఐశ్వర్యారాయ్ తో పాటు కొందరు భారతీయ కథానాయికలకు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కుతోంది. ఈసారి ఆ అవకాశం ట్యాలెంటెడ్ ఆలియా భట్ ని వరించింది.
కేన్స్ అనుభవజ్ఞురాలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో కలిసి ప్రతిష్ఠాత్మక వేదికపై తన ప్రదర్శన ఉంటుందని తాజాగా ఆలియా ధృవీకరించింది. ఈ ఇద్దరు నటీమణులు గ్లోబల్ బ్రాండ్స్ ఎవా లాంగోరియా, వియోలా డేవిస్ లకు కేన్స్ లో ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారు. ఇలాంటి అరుదైన అవకాశం తనకు దక్కినందుకు అలియా ఉత్సాహం వ్యక్తం చేసింది. ఇద్దరు క్రేజీ భామల ఆరంగేట్రంతో కేన్స్- 2025 వేడుకల్లో భారతీయ ప్రాతినిధ్యం మరింత మెరుగైందని చెప్పొచ్చు.
కేన్స్ ఉత్సవాల్లో భారతీయ మహిళ ఉనికిని చాటే అవకాశం రావడం నిజంగా ఉత్సాహాన్నిస్తోందని, పాపులర్ బ్రాండ్ కి ప్రచారకర్తగా ఇక్కడ అడుగుపెట్టడం ఆనందాన్నిస్తోందని తాజాగా ఆలియా వెల్లడించింది. గత రెండు దశాబ్దాలుగా భారతీయతకు, ప్రపంచ గ్లామర్‌కు పర్యాయపదంగా మారిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు ఆలియా ర్యాంప్ పై సందడి చేయనుండడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ప్రపంచ రాయబారులుగా ఈ జోడీ ఎవా లాంగోరియా, వియోలా డేవిస్, జేన్ ఫోండా, అజా నవోమి కింగ్, ఆండీ మెక్‌డోవెల్, సిమోన్ ఆష్లే, ఎల్లే ఫానింగ్, బెబే వియో, యెస్యూల్ట్ వంటి బ్రాండ్లకు ప్రచారం నిర్వహించనున్నారు.
అలియా ప్రస్తుతం ప్యాక్డ్ షెడ్యూల్ తో బిజీ బిజీగా ఉంది. సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రీకరణ సాగుతోంది. అదే సమయంలో `ఆల్ఫా` కోసం ప్రిపరేషన్ సాగిస్తోంది. YRF గూఢచారి విశ్వంలో నాయికా ప్రధాన చిత్రం కోసం ఆలియా స్టంట్స్ చేయనుందని సమాచారం. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.