Begin typing your search above and press return to search.

సినిమా ఎడిట‌ర్ల‌పై AI ప్ర‌భావం ఎలా ఉంది అంటే?

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చలనచిత్ర రంగాన్ని.. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ విభాగాన్ని వేగంగా రీడిఫైన్ చేస్తోంద‌ని ఫిలింన‌గ‌ర్- కృష్ణాన‌గ‌ర్ లో చ‌ర్చ సాగుతోంది.

By:  Sivaji Kontham   |   10 Jun 2026 8:15 AM IST
సినిమా ఎడిట‌ర్ల‌పై AI ప్ర‌భావం ఎలా ఉంది అంటే?
X

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్ర‌వేశం తో సినిమా ఎడిట‌ర్ల ప‌ని త‌గ్గిపోయిందా? ప్ర‌స్తుతం సినిమాల ఎడిటింగ్ లో ఏఐ ప్ర‌భావం ఎంత‌వ‌ర‌కూ ఉంది? అస‌లేం జ‌రుగుతోంది? ఏఐ ఎడిట‌ర్ల ప‌నిని సులువుగా మార్చిందా? క్లిష్ఠ‌త‌రంగా మార్చిందా? ఏఐని ఎడిట‌ర్లు ఎలా తమ ప‌నికి ఉప‌యోగించుకోగ‌ల‌రు? ఫిలింఇనిస్టిట్యూట్ ల‌లో కాబోయే వ‌ర్ధ‌మాన ఎడిట‌ర్లు ఏఐని నేర్చుకోవాల్సి ఉంటుందా?.. 8 సార్లు జాతీయ అవార్డ్ అందుకున్న వెట‌ర‌న్ ఫిలిం ఎడిట‌ర్ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ `లెస్స‌న్స్` నుంచి అర్థం చేసుకోవాల్సిన విష‌యాలు ఏం ఉన్నాయి? అంటే....!

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చలనచిత్ర రంగాన్ని.. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ విభాగాన్ని వేగంగా రీడిఫైన్ చేస్తోంద‌ని ఫిలింన‌గ‌ర్- కృష్ణాన‌గ‌ర్ లో చ‌ర్చ సాగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, స్క్రిప్ట్ అనాలిసిస్ నుండి ఎడిటింగ్ టేబుల్ వరకు ఏఐ సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో ఎడిటర్ల భవిష్యత్తుపై సరికొత్త చర్చ మొదలైంది. టెక్నాలజీ రాకతో ఎడిటర్ల పని పూర్తిగా తగ్గిపోతుందా లేదా వారి సృజనాత్మకతకు ఇది అదనపు బలాన్ని ఇస్తుందా? అనే ప్రశ్నలపై పరిశ్రమ వర్గాలు భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నాయి. ఆర్జీవీ లాంటి వాళ్లు ఇక సినిమా తీయ‌డానికి టెక్నీషియ‌న్ల ప‌ని త‌గ్గిపోయింద‌ని చెబుతున్నారు. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలోను చాలా ఉద్యోగాలు ఖాళీ అయిపోవ‌డం గ్యారెంటీ అని కూడా కొంద‌రు టెక్ గురూలు యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల‌లో భ‌య‌పెడుతున్నారు. అయితే ఏఐ అనేది ఎడిటర్ల ఉపాధిని దెబ్బతీసే శత్రువు కాదని... పని విధానాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా ఎడిటింగ్ అనేది కేవలం కొన్ని దృశ్యాలను కత్తిరించి అతికించే యాంత్రిక ప్రక్రియ కాదు. అది కథలోని మూడ్‌ను.. పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకుడికి కనెక్ట్ చేసే ఒక గొప్ప మానసిక కళ. ఏఐ సాఫ్ట్‌వేర్‌లు సాంకేతికంగా క‌చ్ఛితమైన కట్స్ ఇవ్వగలవు.. నిర్మాణపరంగా లోపాలు లేని అవుట్‌పుట్‌ను క్షణాల్లో సిద్ధం చేయగలవు. కానీ ఒక సన్నివేశంలో ఏ క్షణంలో ప్రేక్షకుడు ఉద్వేగానికి లోనవ్వాలి? ఎక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి? అనే విషయాలను కేవలం మానవ అంతర్ దృష్టి.. అనుభవం మాత్రమే నిర్ణయించగలవు. సినిమాల్లో భావోద్వేగ శక్తి (ఎమోష‌న్స్ తో కూడుకున్న ఎన‌ర్జీ) మానవ జీవితంలోని లోపాలు.. తెలివిత‌క్కువ లేదా ఎక్కువ‌ నిర్ణయాలు..నమ్మకాల నుండే పొందుతాయి కాబట్టి ఎడిటర్ల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు.

ప్రస్తుతం పరిశ్రమలోని ఎడిటర్లు ఏఐ సాంకేతికతను ఒక అద్భుతమైన అసిస్టెంట్‌గా మలచుకుంటూ తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. గంటల కొద్దీ షూట్ చేసిన రష్ ఫుటేజ్ నుండి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అవసరమైన షాట్లను వేరు చేయడం... ఆటోమేటిక్‌గా సబ్‌టైటిల్స్ జనరేట్ చేయడం .... డైలాగ్స్ ఆధారంగా రఫ్ కట్స్ నిర్మించడం వంటి పనులను ఏఐ సులువుగా చేస్తోంది. అలాగే లొకేషన్‌లో వచ్చే అనవసరపు శబ్దాలను తొలగించి ఆడియోను క్లియర్ చేయడం... కలర్ గ్రేడింగ్‌ను వేగవంతం చేయడం వంటి రొటీన్ పనుల భారాన్ని ఏఐ తగ్గించింది. దీనివల్ల ఎడిటర్లు సాంకేతిక ఇబ్బందులపై కాకుండా... కథా గమనాన్ని - సృజనాత్మకతను మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నారు.

ఈ వేగవంతమైన సాంకేతిక మార్పుల నేపథ్యంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుకుంటున్న వర్థమాన ఎడిటర్లు ఏఐ టూల్స్‌ను నేర్చుకోవడం ఇప్పుడు విధిగా మారింది. ప్రీమియర్ ప్రో, డావిన్చీ రిజాల్వ్ వంటి ప్రముఖ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లు ఇప్పటికే ఏఐ ఫీచర్లను తమలో అంతర్భాగంగా చేర్చాయి. భవిష్యత్తు ఎడిటర్లు కేవలం సాఫ్ట్‌వేర్ ఆపరేటర్లుగా మిగిలిపోకుండా... ఏఐ సృష్టించే విజువల్ బ్లాక్స్‌ను సమర్థవంతంగా క్యూరేట్ చేయడం.. షాట్ కన్‌స్ట్ర‌క్షన్ చేయడం .. వాటికి భావోద్వేగ రూపాన్ని ఇచ్చే నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. టెక్నాలజీతో నిరంతరం అప్‌డేట్ అవ్వడం.. దానిని మన క్రియేటివిటీకి అనుకూలంగా వాడుకోవడం నేటి పోటీ ప్రపంచంలో మనుగడ సాధించడానికి ఏకైక మార్గం.

ముఖ్యంగా ఏఐ సాంకేతికత ఎడిటర్ల పనిని ఒకే సమయంలో సులువుగా మార్చింది.. అదే స‌మ‌యంలో క్లిష్టతరంగా మార్చింది. రోజువారీ బోరింగ్ పనులను సులభతరం చేసినా.. ఒకే సీన్‌ను వందల రకాలుగా మార్చే ఆప్షన్లను ముందే చూపించడం ద్వారా ``ఏ వెర్షన్ కథకు న్యాయం చేస్తుంది`` అని తేల్చుకోవడం ఎడిటర్లకు ఒక కొత్త సవాలుగా మారింది. ఏఐ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే... దానిని ఉపయోగించి వెండితెరపై అద్భుతమైన శిల్పాన్ని చెక్కాలా లేదా చేతులు కాల్చుకోవాలా అనేది పూర్తిగా దాన్ని నడిపించే ఎడిటర్ సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. సాంకేతికత ఎంత విస్తరించినా... మానవ మేధస్సు- భావోద్వేగాల కలయికే ఎప్పటికీ సినిమా అసలైన ఊపిరిగా నిలుస్తుందని 8సార్లు జాతీయ అవార్డ్ అందుకున్న శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎందుకు అన్నారో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.