Begin typing your search above and press return to search.

'అగధ' మూవీ రివ్యూ

మహాదేవి (కామాక్షి భాస్కర్ల) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి బాబాయి దగ్గర పెరిగిన అమ్మాయి. ఆమెకు దైవ అనుగ్రహం వల్ల ప్రత్యేక శక్తులు రావడంతో దుష్ట శక్తుల వల్ల బాధ పడే వారిని ఆదుకుంటూ సమాజానికే తన జీవితాన్ని అంకితం చేస్తుంది.

By:  Tupaki Desk   |   14 Aug 2026 3:38 PM IST
అగధ మూవీ రివ్యూ
X

'అగధ' మూవీ రివ్యూ

నటీనటులు: కామాక్షి భాస్కర్ల - శ్రవణ్ రెడ్డి - జోవిక విజయ్ కుమార్ - ఉల్క గుప్తా - భానుచందర్ - షిజు - వనిత విజయ్ కుమార్ తదితరులు

సంగీతం: రాకేష్ వెంకటాపురం

ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి

నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు

రచన - దర్శకత్వం: ఎంఎస్ రాజు

నిర్మాతగా ఒకప్పుడు గొప్ప గొప్ప చిత్రాలు నిర్మించిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు తీస్తున్నారు. ఆయన రూపొందించిన కొత్త సినిమా.. అగధ. ఈ రోజే థియేటర్లలోకి దిగిన ఈ హారర్ థ్రిల్లర్.. ప్రేక్షకులను ఎంత మేర అలరించిందో తెలుసుకుందాం పదండి.

కథ:

మహాదేవి (కామాక్షి భాస్కర్ల) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి బాబాయి దగ్గర పెరిగిన అమ్మాయి. ఆమెకు దైవ అనుగ్రహం వల్ల ప్రత్యేక శక్తులు రావడంతో దుష్ట శక్తుల వల్ల బాధ పడే వారిని ఆదుకుంటూ సమాజానికే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. ఒక.సమయంలో తన బాబాయి కూతురు మహిమ (ఉల్క గుప్తా) తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో కలిపి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఊరికి వెళ్ళిన ఆమెకు.. ఆ కుటుంబం పెద్ద చిక్కుల్లో ఉన్నట్లు అర్థం చేసుకుంటుంది. దీని వెనుక ఉన్నది అగధ అనే దుష్ట శక్తి అని అర్థమవుతుంది. ఇంతకీ మహిమ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది.. అగధ ఎవరు.. దాని కథేంటి.. దాన్నుంచి బాబాయి కుటుంబాన్ని మహాదేవి కాపాడగలిగిందా.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

దైవ భక్తికి.. దుష్ట శక్తికి మధ్య పోరాటం అన్నది సినిమాల్లో దశాబ్దాల నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఫార్ములా. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కూడా 90వ దశకంలో ఈ జానర్లో ‘దేవి’ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు దర్శకుడిగా అదే తరహాలో తీసిన ‘అగధ’ మూవీ తీశారు. ఈ ప్రపంచాన్ని ప్రతికూల శక్తులతో నింపేయాలని చూసే ఒక మహా దుష్ట శక్తితో.. దైవానుగ్రహం ఉన్న ఒక అమ్మాయి చేసే పోరాటమే ఈ సినిమా. ఈ కథను కొంచెం భిన్నంగానే చెప్పే ప్రయత్నం చేశారు ఎంఎస్ రాజు. ఆయన ఎంచుకున్న పాయింట్.. కొన్ని ముఖ్య పాత్రలు.. అలాగే కొన్ని సీన్లు క్యూరియస్ గా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే.. షాక్ కు గురిచేసే కొన్ని సీన్లు థ్రిల్ ను పంచుతాయి. కానీ ఎప్పుడో ఒక సీన్లో మెరుపులు మెరిపించడమే తప్ప.. ఈ సినిమాలో ఫ్లో మాత్రం మిస్ అయింది. ఎగుడు దిగుడు కథనం.. అసహనం కలిగించే కొన్ని పాత్రల చిత్రణ.. ఆ పాత్రల్లో ఆర్టిస్టుల నటన.. స్లో నేరేషన్ అగధ ఫ్లోను దెబ్బ తీశాయి. ఈ జానర్ లవర్స్.. కాన్సెప్ట్ - కొన్ని ఎపిసోడ్ల కోసం అగధపై ఒక లుక్కేయొచ్చు.

‘అగధ’లో టైటిల్ చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి సినిమాలో దాదాపు సగానికి పైగా సమయం గడపాల్సి ఉంటుంది. ఏదైనా మిస్టరీ చుట్టూ కథ నడిపేటపుడు ఆరంభంలో కథ నెమ్మదిగా నడవడం మామూలే. కానీ పాత్రలు ఆసక్తి రేకెత్తించేలా ఉంటే.. సన్నివేశాలు క్యూరియాసిటీ పెంచేలా ఉంటే కథనం నెమ్మదిగా ఉన్నా ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు. కానీ ‘అగధ’లో కథను ఆరంభించిన తీరు.. పాత్రల చిత్రణ ప్రేక్షకుల ఆసక్తిని అంతకంతకూ తగ్గించేలా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో జోవిక విజయ్ కుమార్ పాత్రను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగిస్తుంది. అసలా పాత్ర ఏంటో.. దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాదు. దీనికి తోడు జోవిక పెర్ఫామెన్స్ కూడా ఆ పాత్రను ఎలివేట్ చేసేలా లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దాని వల్ల ఒళ్లు జలదరించేలా చేయాల్సిన సీన్లు కూడా తేలిపోయాయి. అసలు కథతో ఈ పాత్రను కనెక్ట్ చేయడంలో.. కొన్ని సన్నివేశాల ప్లేస్మెంట్ విషయంలో కూడా ఎంఎస్ రాజు స్క్రీన్ ప్లే ఫెయిలైంది. ఇంకా కొన్ని పాత్రలు.. సన్నివేశాలను కూడా సరిగా తీర్చిదిద్దలేదు.

ఐతే కామాక్షి భాస్కర్ల చేసిన మహాదేవి పాత్ర.. శ్రవణ్ రెడ్డి క్యారెక్టర్.. ఆ పాత్రల్లో వారి పెర్ఫామెన్స్ ‘అగధ’కు హైలైట్ గా నిలిచాయి. తొలి అరగంటలో సాధారణంగా సాగిపోయే ‘అగధ’.. తర్వాత ట్రాక్ ఎక్కుతుంది. ముఖ్యంగా అడ్వెంచరస్ వీడియో కోసం అడవిలోకి వెళ్లే ముగ్గురు మిత్రులు అగధ ఉచ్చులో చిక్కుకునే ఎపిసోడ్ దగ్గర్నుంచి ఈ కథ పాకాన పడుతుంది. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ.. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ పెంచుతూ ఆ ఎపిసోడ్ మంచి హై ఇస్తుంది. గుహ దగ్గర సన్నివేశం కూడా స్టన్నింగ్ గా తీశారు ఎంఎస్ రాజు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంది. కానీ సెకండాఫ్ లో మళ్ళీ కథనం మళ్లీ పడి లేస్తూ సాగుతుంది. ఉల్క గుప్తా.. జోవిక పాత్రల చుట్టూ గందరగోళంగా సాగే సీన్లతో ప్రేక్షకులకు అసహనం తప్పదు. కానీ చివరి అరగంటలో ‘అగధ’ మళ్లీ ట్రాక్ ఎక్కుతుంది. క్లైమాక్స్ సినిమాకు బలంగా నిలిచింది. అగధకు అడ్డుకట్ట వేయడానికి మహాదేవి వేసిన వ్యూహం భలేగా అనిపిస్తుంది. ఎంఎస్ రాజు ముగింపులో చూపించిన మెరుపులను సినిమా అంతా కొనసాగించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘అగధ’ ఐడియా ఎగ్జైటింగ్ గా ఉన్నా.. ఎగ్జిక్యూషన్ సాధారణంగా సాగడం వల్ల అనుకున్నంత కిక్కు ఇవ్వలేకపోయింది.

నటీనటులు:

మహాదేవిగా కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో రాణించింది. పాత్రకు తగ్గట్లు సటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్లైమాక్సులో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. కామాక్షి గెటప్ కూడా బాగుంది. శ్రవణ్ రెడ్డి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను బాగా క్యారీ చేశాడు. సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెర్ అతనే. ఉల్క గుప్తా ఒక సీన్లో బాగా చేసింది. ఆమెకు స్కోప్ తక్కువే. జోవిక విజయ్ కుమార్ పాత్ర తేలిపోయింది. ఆ క్యారెక్టర్ కు ఆమె బ్యాడ్ ఛాయిస్. భానుచందర్.. వనిత విజయ్ కుమార్ గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు. స్వామీజీ పాత్రలో షిజు బాగానే చేశాడు.

సాంకేతిక వర్గం:

అగధ టెక్నికల్ గా ఓకే అనిపిస్తుంది. పాటలు లేని ఈ సినిమాలో రాకేష్ వెంకటాచలం నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాల శైలికి తగ్గట్లుగా సాగింది. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఒక మోస్తరుగా అనిపిస్తాయి. రైటర్ కం డైరెక్టర్ ఎంఎస్ రాజు అగధ కోసం ఎఫర్ట్ పెట్టారు కానీ.. అది సరిపోలేదు. ఆయన క్లారిటీ లేని రైటింగ్ వల్ల కథనం ఆసక్తికరంగా సాగలేదు. కొన్ని సన్నివేశాల వరకు రాజు టేకింగ్ బాగున్నా.. కంప్లీట్ సినిమాను అందించలేకపోయారు.

చివరగా: అగధ.. సరిపోని థ్రిల్

రేటింగ్ - 2.25/5