Begin typing your search above and press return to search.

1000కోట్ల క్ల‌బ్‌లో సందీప్ రెడ్డి వంగా?

భార‌త‌దేశంలో 1000 కోట్లు అంత‌కుమించిన వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు చాలా అరుదుగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2025 8:00 PM IST
1000కోట్ల క్ల‌బ్‌లో సందీప్ రెడ్డి వంగా?
X

భార‌త‌దేశంలో 1000 కోట్లు అంత‌కుమించిన వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు చాలా అరుదుగా ఉన్నారు. దీనిని ప్రారంభించిన‌ది దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ. దంగ‌ల్ స్వ‌దేశంలో కేవ‌లం 400కోట్లు లోపు వ‌సూలు చేయ‌గా, చైనాలో భీభ‌త్సం సృష్టించ‌డంతో 1500కోట్లు పైగా వ‌సూలు చేయ‌గ‌లిగింది. అయితే భార‌త‌దేశంలో 1000 కోట్లు వ‌సూలు చేసిన మొద‌టి చిత్రంగా `బాహుబ‌లి 2` చ‌రిత్ర సృష్టించింది. ఈ సినిమాని ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి రూపొందించిన బాహుబ‌లి 2 దాదాపు 1800కోట్లు వ‌సూలు చేయ‌గా, ఆర్.ఆర్.ఆర్ దాదాపు 1190 కోట్లు వ‌సూలు చేసింది. రాజ‌మౌళి త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి ఫీట్ వేయ‌గ‌లిగిన వాడు ప్ర‌శాంత్ నీల్. కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యం సాధించి ఏకంగా 1100 కోట్లు వ‌సూలు చేసింది.

ఆ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన - `పుష్ప- 2` చిత్రం 1000 కోట్ల క్ల‌బ్ లో చేరుకుంది. ఈ చిత్రం భార‌త‌దేశంలో చాలా రికార్డుల‌ను తిరగ‌రాసింది. ఫుల్ ర‌న్ లో రూ. 1493 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. అదే స‌మ‌యంలో సిద్ధార్థ్ ఆనంద్- షారూఖ్ ల `ప‌ఠాన్` చిత్రం 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టింది.

ఇప్పుడు చాలా కాలానికి మ‌ళ్లీ బాలీవుడ్ నుంచి 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెడుతున్న చిత్రంగా ఆదిత్యాధ‌ర్ `దురంధ‌ర్` గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. ర‌ణ్ వీర్ సింగ్ త‌న కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంలో నటించ‌డంతో అత‌డు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఏ నోట విన్నా `దురంధ‌ర్` మాటే. ఈ సినిమాకి సీక్వెల్ ని వెంట‌నే పూర్తి చేసి 2026 మార్చిలో రిలీజ్ చేస్తుండ‌డంతో ర‌ణ్ వీర్ అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. కేవ‌లం మ‌రో మూడు నెల‌ల్లో దురంధ‌ర్ 2 రూపంలో ఆదిత్యాధ‌ర్ మ‌రో 1000 కోట్ల క్ల‌బ్ అందుకుంటాడ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో సందీప్ రెడ్డి వంగా `యానిమ‌ల్` కూడా 1000 కోట్ల క్ల‌బ్ లో చేరుతుంది! అంటూ మ‌రో కొత్త ప్ర‌చారం వేడి పుట్టిస్తోంది. దీనికి కార‌ణం యానిమ‌ల్ ని ఇప్పుడు జ‌పాన్ భాష‌లోకి అనువ‌దించి ఆ దేశంలో విడుద‌ల చేస్తుండ‌ట‌మే. రణబీర్ కపూర్ -సందీప్ రెడ్డి వంగా `యానిమల్` చిత్రం విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత కొత్త మార్కెట్‌లో తిరిగి థియేటర్లలోకి వస్తోంది. ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా 13 ఫిబ్రవరి 2026న జపాన్ అంతటా సినిమాహాళ్లలో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు.

``ఈ మనిషిని ఆపలేరు`` అనే జపనీస్ ట్యాగ్‌లైన్‌తో ర‌ణ‌బీర్ క‌పూర్ తీవ్ర‌మైన రూపాన్ని పోస్ట‌ర్ లో వేయ‌డంతో ఇది ఆస‌క్తిని పెంచింది. యానిమల్ మొదట డిసెంబర్ 2023లో భారతదేశంలో విడుదలైంది. ఇది దేశీయంగా దాదాపు రూ. 553 కోట్లు నికర వ‌సూళ్ల‌ను సాధించ‌గా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 915 కోట్లు ఆర్జించింది. ఇది అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒక‌టిగా నిలిచింది. జపాన్‌లో విడుదల కానుండ‌టంతో ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును అధిగ‌మిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ధురంధర్ 1000 కోట్ల క్ల‌బ్ గురించి ముచ్చ‌టిస్తున్న స‌మ‌యంలోనే యానిమల్ కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల నుండి రూ. 1100 కోట్ల మధ్య వసూళ్లను సాధిస్తుందని అంచనా వేయడంతో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇటీవల జపాన్‌లో భారతీయ సినిమాలు భారీ వ‌సూళ్లను సాధిస్తున్నాయి. RRR -150 కోట్లు వ‌సూలు చేయ‌గా, కేజీఎఫ్‌: చాప్టర్ 2 కూడా అద్భుత‌మైన బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. ర‌ణ‌బీర్- యానిమల్ కూడా ఇదే తీరుగా బాక్సాఫీస్ వ‌ద్ద రాణిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్‌లో రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ ఇత‌ర‌ కీలక పాత్రల్లో నటించారు.