హిట్3 ఈవెంట్ లో లీకు.. షాకైన డైరెక్టర్
నాని హీరోగా నటించిన హిట్: ది థర్డ్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది.
By: Tupaki Desk | 28 April 2025 5:08 AMనాని హీరోగా నటించిన హిట్: ది థర్డ్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు రాజమౌళి చీఫ్ గెస్టుగా రావడంతో అందరి ఇంట్రెస్ట్ ఈ ఈవెంట్ పైనే ఉంది. అదే ఈవెంట్ కు హిట్ యూనివర్స్ హీరోలైన విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా హాజరైన విషయం తెలిసిందే. వారిద్దరూ కూడా ఆ ఈవెంట్ కు వచ్చినప్పటికీ హిట్3 లో తమ ప్రమేయం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.
అయితే ఎవరెంత జాగ్రత్తగా ఉంచుదామనుకున్నా హిట్3 గురించి ఓ లీక్ అనుకోకుండా బయటి కొచ్చేసింది. ఆ లీకును బయటివారెవరో చేయలేదు. హిట్3 ఫైట్ మాస్టర్ సతీషే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. ఆ లీక్ మరేదో కాదు. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వస్తున్న అడివి శేష్ గురించి. హిట్3 లో అడివి శేష్ క్యామియో ఉంటుందని వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఈవెంట్ లో ఫైట్ మాస్టర్ సతీష్ మాట్లాడుతూ, హిట్ 3 గురించి పలు విషయాలను మాట్లాడి, ఆఖరిలో శ్రీనిధి శెట్టి గురించి మాట్లాడుతూ ఆమె ఓ ఫైట్ సీక్వెన్స్ లో బాగా చేసిందని నోరు జారాడు. దీంతో ఒక్కసారిగా శైలేష్ షాకవ్వగా, యాంకర్ సుమ అతన్ని ఇంకేమైనా ఉన్నాయా అని సరదాగా అడగ్గా, అడివి శేష్ కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నారని, ఆయన కూడా చాలా బాగా చేశాడని చెప్పి ఆ తర్వాత నాలుక్కరుచుకున్నాడు.
ఈవెంట్ లో అడివి శేష్ కూడా తన స్పీచ్ లో భాగంగా హిట్3 లో ఆఖరి 30 నిమిషాలు చూశానని, చాలా బావుందని, సినిమాలో ఎన్నో ట్విస్టులుంటాయన్నాడు. దీంతో ఆ ట్విస్ట్ ఆయన క్యామియోనేనని అందరూ ఫిక్సయ్యారు. సినిమాలో శేష్ కనిపించే ఫైట్ సీన్ జమ్మూ కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, శేష్ క్యారెక్టర్ కథను కీలక మలుపు తిప్పుతుందని, నాని, శేష్ కలిసి ప్రత్యర్థిని ఎదుర్కొనే ఫైట్ సీన్ విజువల్ వండర్ లా ఉంటుందని చెప్తున్నారు.
హిట్3లో శేష్ ఉన్నాడనే మాటల్ని బలం చేస్తూ నాని తన స్పీచ్ లో కూడా ఓ హింట్ ఇచ్చాడు. హిట్3 లో థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్లు కొందరున్నారు కానీ వాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడలేనని, సక్సెస్‌మీట్ లో మాత్రమే వాళ్ల గురించి మాట్లాడగలను అని చెప్పాడు. దీన్ని బట్టి నాని చెప్పింది శేష్ క్యామియో గురించేనని అందరూ ఫిక్సయ్యారు. మరి హిట్3లో శేష్ ఒక్కడే ఉన్నాడా లేక విశ్వక్ కూడా ఓ చిన్న పాత్ర ఏమైనా చేశాడా అనేది చూడాలి.