రణ్‌వీర్-ఆదిత్యాధర్ .. 'దురంధర్ 2' తర్వాత బిగ్ స్కెచ్ ఇదే!
ఆదిత్య ధర్ -రణవీర్ సింగ్ కాంబినేషన్ పై ఇటీవల ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 12 Feb 2026 10:39 PM ISTఆదిత్య ధర్ -రణవీర్ సింగ్ కాంబినేషన్ పై ఇటీవల ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ జోడీ నుంచి వచ్చిన `దురంధర్` భారతీయ సినీపరిశ్రమలో చాలా రికార్డులను తిరగరాయడమే దీనికి కారణం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1100కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ చెబుతోంది. దీనిలో 800 కోట్ల నెట్ కేవలం హిందీ బెల్ట్ నుంచే వసూలు చేయడం ఆసక్తికరం. అందుకే ఈ జోడీ నుంచి తదుపరి రాబోతున్న దురంధర్ 2 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంతలోనే ఇప్పుడు మరో కీలక పరిణామం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఆదిత్యాధర్ `దురంధర్` కంటే ముందే ఒక భారీ హిస్టారికల్ కథాంశంతో బిగ్ స్కెచ్ వేసాడు. కానీ అప్పటికి అతడికి అంత సీన్ లేదు. కేవలం `యూరి- ది సర్జికల్ స్ట్రైక్స్` చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న వన్ ఫిలిం వండర్ కిడ్ మాత్రమే. దానివల్ల అతడిని నమ్మి అత్యంత భారీ బడ్జెట్లను వెచ్చించేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు. బడ్జెట్లు, భారీ వీఎఫ్ఎక్స్ అవసరాలు, కాస్టింగ్, మార్కెట్ లిమిటేషన్స్ లాంటి రకరకాల కారణాలతో హిస్టారికల్ కాన్సెప్టుతో రూపొందాల్సిన ఆ సినిమా ఆగిపోయింది. దీనికి `ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ` అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసారు.
ఈ సినిమాలో విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తాడని కూడా ప్రకటించారు. అతడి పోస్టర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. కానీ ఎందుకనో మధ్యలోనే డ్రాప్ అయ్యారు. దీనికి కారణం బడ్జెట్ సంబంధ సమస్యలు.. హీరో ఇమేజ్. ఇప్పుడు జియో స్టూడియోస్ తో కలిసి ఆదిత్యాధర్ కి చెందిన బి 62 స్టూడియోస్ ఒక ఒప్పందం చేసుకోవడం చర్చగా మారింది. దీని ప్రకారం రెండేళ్ల పాటు కలిసి పని చేయాలనే డీల్ ని పొడిగించారని తెలుస్తోంది. ఇరు సంస్థల కలయికలో ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించాలనేది ప్లాన్.
ఇందులో భాగంగానే మైథాలజీ కాన్సెప్టుతో అత్యంత భారీ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో రణ్ వీర్ సింగ్ నటిస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఇది అశ్వద్ధామ కథతోనేనా? లేక ప్రత్యేకమైన కథాంశాన్ని ఎంపిక చేసారా? అన్నదానిపై ఇంకా స్పష్ఠత లేదు. ప్రస్తుతానికి ఆదిత్యాధర్ తో దురంధర్, దురంధర్ 2 తర్వాత మరో భారీ సినిమా చేసేందుకు రణ్ వీర్ ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ విక్కీ కౌశల్ స్థానంలో రణ్ వీర్ సింగ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోని ఎంపిక చేసుకుంటే కలిసొస్తుందని ఆదిత్యాధర్ భావించారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ఒక భారీ మైథాలజికల్ యాక్షన్ మూవీ దాదాపు ఖాయమైనట్టేనని ముంబై మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఇది `అశ్వద్ధామ` కథేనా లేక సరికొత్త స్క్రిప్టా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
రణ్ వీర్ సింగ్ ఫోకస్ అంతా ప్రస్తుతం దురంధర్ 2 రిలీజ్ ప్రమోషన్స్ పైనే. మార్చిలో విడుదల కానున్న ఈ సినిమాతో మరిన్ని రికార్డులు బ్రేక్ చేయాలనే కసి టీమ్ లో కనిపిస్తోంది. దానికి తగ్గట్టు ప్రచారాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
