యాక్షన్ మోడ్‌లో వెంకీ మామ!
గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో పొంగల్ రేసులో దిగిన వెంకీ మామ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుని మాంచి జోష్‌ని ప్రదర్శించారు.
By: Ravindar Gorantla | 22 April 2026 8:19 PM ISTగత ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో పొంగల్ రేసులో దిగిన వెంకీ మామ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుని మాంచి జోష్‌ని ప్రదర్శించారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి `మన శంకరవరప్రసాద్ గారు`తో బరిలోకి దిగి ఔరా అనిపించారు. ఇప్పుడు సోలో మూవీతో ప్రేక్షకుల్ని అలరించడానికి ముస్తాబవుతున్నారు. వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ఆదర్శ కుటుంబం`. హౌస్ నంబర్ 47 అనేది ఉపశీర్షిక. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
వెంకటేష్ నటించిన `నువ్వు నాకు నచ్చావ్`, మళ్లీశ్వరి సినిమాలకు కథ, మాటలు అందించిన త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేయాలని ఎంతో కాలంగా అనుకుంటున్నారు. కానీ ఎప్పటి కప్పుడు ఏవో కమిట్‌మెంట్‌ల కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ఫైనల్‌గా ఇప్పటికి వీరిద్దరి కాంబినేషన్ కుదిరింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా టైటిల్ ఉండటంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో జరుగుతోంది. వెంకటేష్ పాల్గొనగా కీలక యాక్షన్ సన్నివేశాలని మెట్రో స్టేషన్‌లో చిత్రీకరిస్తున్నారు. త్రివిక్రమ్ మార్కు కామెడీ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్‌రెడ్డి, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన హర్షవర్థన్ రామేశ్వర్ ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నారు.
ఇటీవల అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో వేసిన ప్రత్యేక రైల్ సెట్‌లో కీలక ఘట్టాలని చిత్రీకరించిన త్రివిక్రమ్ ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా యాక్షన్ సీక్వెన్స్‌లని మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, వెంకటేష్ టైమింగ్ వెరసి ఈ సినిమా ఓ రేంజ్‌లో నవ్వులు పూయించడం ఖాయం అని అంతా అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని అక్టోబర్‌లో దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ కారణంగానే ఫుల్ స్పీడుతో ఈ మూవీని పూర్తి చేస్తున్నారట.
అంతే కాకుండా దీన్ని త్వరగా పూర్తి చేసి కుమారస్వామి స్టోరీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని స్టార్ట్ చేయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. దాంతో వెంకీ మూవీని శరవేగంగా పూర్తి చేసి కుమారస్వామి కథతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిచనున్న ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నం కాబోతున్నారు త్రివిక్రమ్. అందుకే ఈ మూవీని ఫాస్ట్ ఫాస్ట్‌గా పూర్తి చేస్తున్నారట. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ఎన్టీఆర్ నటిస్తాడా? లేక బన్నీ రంగంలోకి దిగుతాడా? అన్నది వేచి చూడాల్సిందే.
