ధర్మ ప్రొడక్షన్స్‌లో 1000 కోట్లు.. రాజస్థాన్ రాయల్స్‌లో 2000 కోట్లు: పూనవల్లా బిజినెస్ స్ట్రాటజీ!
ఆదర్ పూనవల్లా పరిచయం అవసరం లేదు. ఇంతకుముందు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి 50శాతం వాటా కొనుగోలు కోసం పూనవల్లా ఏకంగా 1000 కోట్ల పెట్టుబడి పెట్టారు.
By: Tupaki Desk | 4 May 2026 9:28 AM ISTఆదర్ పూనవల్లా పరిచయం అవసరం లేదు. ఇంతకుముందు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి 50శాతం వాటా కొనుగోలు కోసం పూనవల్లా ఏకంగా 1000 కోట్ల పెట్టుబడి పెట్టారు. అది గ్లామర్ రంగంపై ఆసక్తి. ఇప్పుడు క్రీడారంగంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు మిట్టల్ కుటుంబంతో కలిసి ఏకంగా 15,600 కోట్ల పెట్టుబడిని పెట్టడం ఆసక్తిని కలిగిస్తోంది.
భారతీయ వ్యాపార దిగ్గజం, సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత ఆదర్ పూనవల్లా పెట్టుబడుల శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గ్లామర్ - క్రీడారంగాలపై ఈ వ్యాపారవేత్త చూపుతున్న ఆసక్తి సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏడాది క్రితం బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన `ధర్మ ప్రొడక్షన్స్`లో 50 శాతం వాటాను సుమారు 1,000 కోట్లకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించిన పూనవల్లా.. ఇప్పుడు అంతకంటే భారీ డీల్‌తో క్రీడారంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ కుటుంబంతో కలిసి ఏకంగా 15,600 కోట్ల భారీ వ్యయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ `రాజస్థాన్ రాయల్స్`లో మెజారిటీ వాటాను దక్కించుకోవడం విశేషం.
నిజానికి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు ప్రక్రియ ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. మొదట కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును దక్కించుకోవాలని భావించినా.. నిధుల సేకరణలో తలెత్తిన సమస్యల వల్ల ఆ డీల్ రద్దయింది. ఈ క్రమంలో లక్ష్మీ ఎన్. మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ లతో కలిసి ఆదర్ పూనవల్లా రంగంలోకి దిగి 1.65 బిలియన్ డాలర్ల (సుమారు 15,600 కోట్లు) రికార్డు ధరతో ఈ ఫ్రాంచైజీని కైవసం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా కేవలం ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా.. సౌత్ ఆఫ్రికాలోని `పార్ల్ రాయల్స్`, కరేబియన్‌లోని `బార్బడోస్ రాయల్స్` జట్లు కూడా వీరి సొంతమయ్యాయి. 2026 మూడవ త్రైమాసికంలో ఈ డీల్ పూర్తిగా ముగియనుంది.
ఈ భారీ పెట్టుబడిలో వాటాల విభజనను గమనిస్తే.. మిట్టల్ కుటుంబం సుమారు 75 శాతం మెజారిటీ వాటాను కలిగి ఉండగా.. ఆదర్ పూనవల్లా 18 శాతం వాటాను దక్కించుకున్నారు. మిగిలిన 7 శాతం వాటా మనోజ్ బదాలే వంటి ప్రస్తుత ఇన్వెస్టర్ల దగ్గరే ఉంటుంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కోసం బిడ్ వేసిన పూనవల్లా.. ఇప్పుడు ఆదిత్య మిట్టల్‌తో జతకట్టి రాజస్థాన్ రాయల్స్‌లో భాగస్వామి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బలమైన వారసత్వం కలిగిన ఈ ఫ్రాంచైజీని మరింత వృద్ధి పథంలో నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని సాదుల్‌పూర్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్‌కు ఈ పెట్టుబడి కేవలం వ్యాపారం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగమైన నిర్ణయం కూడా. తన సొంత రాష్ట్రానికి చెందిన జట్టును దక్కించుకోవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. క్రికెట్ పై తనకున్న మక్కువను చాటుకున్నారు. కొత్త ట్యాలెంట్ ను ప్రోత్సహించడంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఉన్న పేరును కొనసాగిస్తామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ టాలెంట్‌ను అందిపుచ్చుకుని జట్టును విజయతీరాలకు చేరుస్తామని ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ ధీమా వ్యక్తం చేశారు. పునర్నిర్మించిన ఈ బోర్డులో వనిషా మిట్టల్-భాటియా కూడా సభ్యురాలిగా వ్యవహరించనున్నారు.
మొత్తానికి ఆదర్ పూనవల్లా అటు సినిమాల్లోనూ, ఇటు క్రీడల్లోనూ వేల కోట్ల పెట్టుబడులు పెట్టడం భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్ -స్పోర్ట్స్ ఎకానమీలో కొత్త శకానికి నాంది పలుకుతోంది. ఈ రెండు రంగాల కోసం పూనవల్లా ఏకంగా 3000కోట్లు పెట్టుబడిని పెట్టారు. కరణ్ జోహార్ క్రియేటివ్ విజన్‌కు పూనవల్లా ఆర్థిక బలం తోడవ్వడం వల్ల బాలీవుడ్ రూపురేఖలు మారతాయని భావిస్తుండగా.. మిట్టల్ కుటుంబంతో కలిసి ఐపీఎల్ మార్కెట్‌ను శాసించేందుకు ఆయన సిద్ధమయ్యారు. గ్లామర్ - గేమ్ మధ్య పూనవల్లా చేస్తున్న ఈ భారీ ప్రయాణం భవిష్యత్తులో మరెన్ని సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
