Begin typing your search above and press return to search.

తెలుగు నటి మరణంపై సహనటి సందేహాలు!

కొద్దిరోజుల క్రితం ప్ర‌ముఖ క‌థానాయిక ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   21 May 2026 1:06 PM IST
తెలుగు నటి మరణంపై సహనటి సందేహాలు!
X

కొద్దిరోజుల క్రితం ప్ర‌ముఖ క‌థానాయిక ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. మాజీ మిస్ పుణే కంటెస్టెంట్, నటి - ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన 33 ఏళ్ల త్విషా శర్మ ఇటీవల తన అత్తవారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. మే 12న జరిగిన ఈ ఘోర ఉదంతం ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్‌కు చెందిన ఒక న్యాయవాదితో త్విషాకు వివాహం జరిగిందని, పెళ్లయిన కేవలం ఆరు నెలలకే ఈ న‌టి ఇలా విగతజీవిగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ మరణవార్తపై త్విషా శర్మతో కలిసి పనిచేసిన తెలుగు నటి శ్వేతా వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆత్మహత్య అనే కోణాన్ని స‌ద‌రు స‌హ‌న‌టి తీవ్రంగా సందేహిస్తున్నారు. `ముగ్గురు మొనగాళ్లు` అనే తెలుగు సినిమా షూటింగ్ సమయంలో త్విషాతో తనకు ఏర్పడిన పరిచయాన్ని శ్వేతా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో తామిద్దరం ఎంతో సరదాగా గడిపామని.. త్విషా ఎప్పుడూ మానసిక ఆందోళనలో ఉన్నట్లు కనిపించలేదని... ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఆమె అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదని శ్వేతా వర్మ ఇన్‌స్టా వేదికగా అభిప్రాయపడ్డారు.

ఈ కేసుపై ప్రస్తుతం పోలీసు విచారణ జరుగుతుండగా...దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చి త్విషాకు క‌చ్చితంగా న్యాయం జరగాలని శ్వేతా వర్మ ఆకాంక్షించారు. ఈ ఘ‌ట‌నపై బాలీవుడ్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ కూడా ఘాటుగా స్పందించారు. వివాహ బంధంలో ఊపిరాడక ఎంతోమంది చదువుకున్న యువతులు తల్లిదండ్రుల సహాయం కోరుతున్నా..పెళ్లయిన తర్వాత కూతుళ్లను పూర్తిగా వదిలేసే దారుణమైన మనస్తత్వం భారతీయ సమాజంలో పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతులు వివాహానికి కంటే ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

మరోవైపు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో మరింత ఘాటుగా స్పందిస్తూ భారతీయ తల్లిదండ్రుల మనస్తత్వాన్ని విమర్శించారు. నేటికీ సమాజంలో చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను అత్తగారింటికి పంపే ఒక వస్తువులా భావిస్తున్నారని.. అక్కడ ఎలాంటి `రిటర్న్ పాలసీ` ఉండదని అనుకుంటారని మండిపడ్డారు. `కన్యాదానం` చేసిన తర్వాత అమ్మాయి అత్తగారిట్లోనే చనిపోవాలి తప్ప వెనక్కి రాకూడదనే ఒక గౌరవప్రదమైన భ్రమల్లో సమాజం బతుకుతోందని.. త్విషా మరణమే అందుకు నిదర్శనమని చిన్మయి దుయ్యబట్టారు.

సమాజంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ, ఫ్యాషన్ లేదా మరే ఇతర రంగంలోనైనా పనిచేసే మహిళలకు స్వయంప్రతిపత్తి (స్వేచ్ఛ) , ఆర్థిక స్వాలంబన అత్యంత ముఖ్యమైన అంశాలు. కేవలం మేకప్, గ్లామర్ ఇండస్ట్రీల ఆకర్షణలకు లోనవడమే కాకుండా.. మహిళలు తమ కెరీర్ పరంగా ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించినప్పుడే ఇలాంటి ఊపిరాడని పరిస్థితుల నుండి ధైర్యంగా బయటపడగలరని ఈ విషాద ఘటన మళ్లీ గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.