Begin typing your search above and press return to search.

నటవారసుల్ని పరిచయం చేసిన సిమ్రన్! కొత్త సీఎంతో క్రేజీ భేటీ

తమిళ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెరపై మ్యాజిక్ చేసిన క్రేజీ కాంబినేషన్లలో దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ సిమ్రన్ జంట ఒకటి.

By:  Sivaji Kontham   |   16 Jun 2026 12:03 AM IST
నటవారసుల్ని పరిచయం చేసిన సిమ్రన్! కొత్త సీఎంతో క్రేజీ భేటీ
X

తమిళ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెరపై మ్యాజిక్ చేసిన క్రేజీ కాంబినేషన్లలో దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ సిమ్రన్ జంట ఒకటి. ఎన్నో ఏళ్ల పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సూపర్ హిట్ జోడీ.. చాలా కాలం తర్వాత మళ్లీ ఒక అరుదైన వేదికపై కలిశారు. అయితే ఈసారి వారి భేటీ సినిమా షూటింగ్‌లో కాదు.. తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో! ఇటీవల తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌ను నటి సిమ్రన్ తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్‌తో తన భర్త, ఇద్దరు కుమారులు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఒకప్పటి తన కో-స్టార్‌ను ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడటం ఎంతో ఆనందంగా ఉందంటూ సిమ్రన్ ఎమోషనల్ అయ్యారు. విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఇన్నేళ్లయినా ఆయనలోని ఆప్యాయత, వినయం, నిజాయతీ ఏమాత్రం తగ్గలేదని కొనియాడారు. ఇక విజ‌య్ సీఎం అయ్యాక రాష్ట్ర అభివృద్ధికి బాట‌లు వేస్తున్నార‌ని అన్నారు. ఈ పాత స్నేహితుల‌ రీ-యూనియన్ నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ పాత రోజులను గుర్తుకు తెస్తోంది.

గతంలో విజయ్ సరసన సిమ్రన్ హీరోయిన్‌గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా `తుళ్ళాద మనముం తుళ్ళుం`, `ప్రియమానవళే`, `ఉదయ్` వంటి చిత్రాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్సులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తమిళ చిత్రసీమలో బెస్ట్ ఆన్-స్క్రీన్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి మధ్య వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి స్నేహబంధం- పరస్పర గౌరవం ఉన్నాయి. ఆ సుదీర్ఘ అనుబంధంతోనే సిమ్రన్ తన ఫ్యామిలీతో కలిసి విజయ్‌ను అభినందించడానికి వచ్చారు.

అయితే ఈ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. సిమ్రన్ తన ఇద్దరు కుమారులను సీఎం విజయ్‌కి పరిచయం చేయడం! ప్రస్తుతం కౌమార దశలో (టీనేజ్) ఉన్న సిమ్ర‌న్ కొడుకులు ఇద్దరూ చూడటానికి చాక్లెట్ బాయ్స్‌లా, ఎంతో హ్యాండ్సమ్‌గా- స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. దీంతో తమిళ మీడియా - సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. కాబోయే న‌ట‌వార‌సుల‌ను సిమ్రన్.. సీఎం విజయ్ ఆశీస్సుల కోసం తీసుకువచ్చారని, భవిష్యత్తులో వీరిని నటులుగా ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో ఉన్నార‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సెలబ్రిటీల వారసులు చిత్ర పరిశ్రమలోకి రావడం సహజమే కాబట్టి సిమ్రన్ కూడా తన ఇద్దరు నటవారసులను త్వరలోనే కోలీవుడ్‌లో హీరోలుగా లాంచ్ చేస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే మరికొందరు మాత్రం వారు కేవలం సీఎంను కలవడానికి మాత్రమే వచ్చారని... బాగా చదువుకుని విదేశాల్లో మంచి ఉద్యోగాలతో సెటిల్ అవుతారేమో అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆ ఇద్దరు స్మార్ట్ కిడ్స్ సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోలు అవుతారా? లేక ఉన్నత చదువులతో వేరే రంగాల్లో స్థిరపడతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.