శోభన సినిమాలు వదిలేయడానికి కారణం?
నటసింహా నందమూరి బాలకృష్ణతో పాటు ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్నారు నటి కం నర్తకి శోభన.
By: Tupaki Desk | 26 Jan 2025 8:30 AM ISTనటసింహా నందమూరి బాలకృష్ణతో పాటు ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్నారు నటి కం నర్తకి శోభన. నేడు ప్రకటించిన `2025 పద్మ పురస్కారా`ల్లో శోభన పేరు మార్మోగింది. శోభన గురించి తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేదు. కథానాయికల్లో అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి. ముఖ్యంగా తెలుగు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో శోభన దాదాపు 230 సినిమాల్లో నటించారు. ఒక నటిగానే కాకుండా నర్తకిగాను శోభనకు గొప్ప గుర్తింపు ఉంది. భరతనాట్య కళాకారిణిగా శోభన సొంత శిక్షణా సంస్థను రన్ చేస్తున్నారు.
అయితే గొప్ప ప్రతిభావని అయిన శోభన ఉన్నట్టుండి సినీపరిశ్రమను విడిచి వెళ్లడానికి కారణం ఏమిటి? అంటే.. తనలోని నటిని నాట్య కళాకారిణి డామినేట్ చేసిందని చెబుతారు. భరత నాట్యం కూచిపూడిలో ఔత్సాహిక యువతను తీర్చిదిద్దడమే ధ్యేయంగా శోభన సినిమాలను విడిచిపెట్టారు. చెన్నైలో ప్రస్తుతం నాట్యాలయాన్ని రన్ చేస్తున్నారు. అయితే మలయాళ సినిమాల్లో నటించేప్పుడు టాప్ హీరోతో శోభన ప్రేమాయణం, పెళ్లి ప్రయత్నాల గురించి అప్పట్లో కొంత చర్చ సాగింది. కానీ అది విఫలమవ్వడంతో కెరీర్ పరంగా కీలక నిర్ణయం తీసుకుందని కూడా రూమర్లు ఉన్నాయి. 54 వయసులోను శోభన బ్యాచిలర్ గానే ఉన్నారు. ఒక చిన్నారిని దత్తత తీసుకుని శోభన మాతృత్వంలోని ఆనందాన్ని ఆస్వాధిస్తున్నారు.
ఇదిలా ఉంటే, శోభన తెలుగు చిత్రసీమలోని నాలుగు మూలస్థంబాలైన అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల సరసన శోభన పలు బ్లాక్ బస్టర్లలో నటించారు. ఇటీవల ప్రభాస్ కల్కి చిత్రంలో ఓ అతిథి పాత్రతో మెప్పించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత నటనలోకి రావాల్సిందిగా అశ్వనిదత్ బృందం శోభనను ఒప్పించగలిగింది. దశాబ్ధాల పాటు నటన, నాట్యంలో విశేష కృషికి గాను శోభనకు పద్మ పురస్కారం దక్కింది.
