సినీనటి రంభ తండ్రి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
ఈ విషయం ఆమెను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
By: Madhu Reddy | 25 May 2026 4:29 PM ISTసినిమా ఇండస్ట్రీలో అనూహ్యంగా ఎదురయ్యే పరిణామాలు అభిమానులను అఘాతంలోకి నెట్టివేస్తున్నాయి. కొంతమంది అనారోగ్యంతో మంచాన పడితే.. మరికొంతమంది తుది శ్వాస విడుస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలే కాదు వారి కుటుంబ సభ్యుల మరణాలు ఇండస్ట్రీని దుఃఖానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు తన అందచందాలతో ఉర్రూతలూగించి.. తన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న సీనియర్ హీరోయిన్ కి తండ్రి వియోగం. ఈ విషయం ఆమెను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
సినీనటి రంభ తండ్రి కన్నుమూత..
ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ రంభ. ఆమె తండ్రి వెంకటేశ్వర రావు సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆమె కన్నీటి పర్యంతం అయింది. "నా హృదయంలో మీకున్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని నాకు తెలుసు. ఎన్ని గొడవలు.. నేను ఎన్ని ఇబ్బందులు కలిగించినా మీరు ఎప్పుడూ అదే చిరునవ్వుతో అన్నింటినీ ఎదుర్కొన్నారు. మీరు లేకపోవడంతో ఈ ప్రపంచం చాలా శూన్యంగా అనిపిస్తోంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్న..మీ ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెరిగిపోలేదు. మీరు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యం అయ్యింది" అంటూ తన తండ్రిని తలుచుకొని విచారం వ్యక్తం చేసింది. కన్న తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న రంభకు ధైర్యాన్ని చేకూర్చాలని అభిమానులు, సినీ ప్రముఖులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. అలాగే ఆమె తండ్రికి సంతాపం వ్యక్తం చేస్తూ ఈమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
రంభ కెరియర్..
1976 జూన్ 5న కృష్ణాజిల్లా విజయవాడలో జన్మించింది రంభ. తన అంద చందాలతో 20 ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది ఈ తెలుగు అమ్మాయి. ఇకపోతే ఈమె అసలు పేరు విజయలక్ష్మి కాగా, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రంభగా తన పేరును మార్చుకుంది. 'ఆ ఒక్కటి అడక్కు' అనే సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత చిరంజీవి, రజినీకాంత్, వెంకటేష్, విజయ్ లాంటి అగ్ర నటులతో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో సుమారు వందకు పైగా చిత్రాలలో నటించిన ఈమె.. భైరవద్వీపం, హలో బ్రదర్ , దేశముదురు పంటి చిత్రాలలో ప్రత్యేక సాంగ్స్ లో నటించి మెప్పించింది.
రంభ వ్యక్తిగత జీవితం..
90వ దశకంలో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన రంభ సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో 2010లో కెనడాలో స్థిరపడిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఈమె టీవీ షోలో జడ్జిగా సందడి చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె తండ్రి మరణించడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
