9 టూ 5 నదియా ఆ తర్వాత జరీనా!
ప్రస్తుతం నటిగా తమిళ, తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే నదియా వృత్తిగత జీవితాన్ని.. .కుటుంబ జీవితాన్ని ఎంతో తెలివిగా బ్యాలెన్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 8:54 PM ISTఅత్త పాత్రలకు..అమ్మ పాత్రలకు...వదిన పాత్రలకు...అక్క పాత్రలకు నదియా ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖంగా అత్త పాత్ర పోషించాలంటే? అందుకు నదియా పర్పెక్ట్ గా సూటవు తుంది. ఆ పాత్రకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఎందుకంటే అత్తారింటికి దారేదిలో త్రివిక్రమ్ ఆ పాత్రను అంత గొప్పగా రాసాడు. ఆ సినిమాతో బాగా ఫేమస్ అయింది. అలాగే 'మిర్చి'లో ప్రభాస్ అమ్మ పాత్రతోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకు న్నారు.అలా నదియా తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. నటనా రంగంలో సీనియర్ అయినా ఈ రెండు సినిమాలకు ఆమెకు ప్రత్యేకమైన ఐడెంటిటీని తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం నటిగా తమిళ, తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే నదియా వృత్తిగత జీవితాన్ని.. .కుటుంబ జీవితాన్ని ఎంతో తెలివిగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ సందర్బంగా రెండింటికి నదియా సమ యం ఎలా కేటాయిస్తారు? అన్నది రివీల్ చేసారు. సినిమా అన్నది నా అభిరుచి మాత్రమే. కానీ అది నా ప్రాధాన్యత కాదు. నా మనసు ఎప్పుడు ఇంటినే కోరుకుంటుంది. షూటింగ్ పూర్తయిన వెంటనే ఫ్లైట్ టైమ్ ఎంతైనా సరే ఇంటికి పరుగులు తీస్తాను. లోకల్ గా ప్టైల్ లేకపోతే ప్రత్యామ్యాయ మార్గాల ద్వారానైనా ఇంటికి చేరతాను.
ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకూ సెట్ లో మాత్రమే నదియాని..ఐదు దాటిన తర్వాత జరీనాగా మారిపోతాను. ఎందుకంటే నా అసలు పేరు అదే. స్టార్ డమ్ ఎప్పుడు పట్టించుకోలేదు. ఇది కేవలం బోనస్ మాత్రమే. అదెంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేం. నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం వల్లనే నేను ఇలా ఉండగలిగాను. సినిమాతోనే గుర్తింపు..ప్రజాధారణ దక్కినా? ఇది జీవితం దానికి మించిన కుటుంబ జీవితం ఎంతో గొప్పదని తల్లిదండ్రులు చెబుతుండేవారు.
అది నా మనసులో బలంగా నాటుకుపోయింది. సినిమాల్లోకి రాకముందే నాకు భర్తతో పరిచయం ఉంది. ఆయనని వివాహం చేసుకుని స్థిరపడతానని అప్పుడే తెలుసు. అదే జరిగింది. వివాహం తర్వాత 15 ఏళ్లు సినిమాలు చేయకుండా అమెరికాలో ఉన్నా. అప్పుడు అక్కడ చదువుకున్నా. అదే సమయంలో అక్కడ సంస్కృతిని బాగా అర్దం చేసుకున్నా' అన్నారు.
