లయ మాటలు త్రివిక్రమ్ వింటున్నారా?
హీరోయిన్‌గా లయకు మరిన్ని అవకాశాల్ని తెచ్చి పెట్టిన ఈ మూవీకి త్రివిక్రమ్ రైటర్. కె. విజయభాస్కర్ డైరెక్షన్‌తో పాటు స్క్రీన్‌ప్లే సమకూరిస్తే త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందించాడు.
By: Tupaki Desk | 20 Jun 2025 3:00 PM ISTవేణు హీరోగా కె.విజయభాస్కర్ రూపొందించిన రొమాంటిక్ కామెడీ డ్రామా `స్వయంవరం`. ఇందులో లయ హీరోయిన్‌గా నటించింది. ఇదే ఆమెకు హీరోయిన్‌గా ఫస్ట్ మూవీ. 1999లో విడుదలై ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి హీరో వేణుకు, హీరోయిన్‌గా లయకు మంచి పేరు తెచ్చి పెట్టింది. హీరోయిన్‌గా లయకు మరిన్ని అవకాశాల్ని తెచ్చి పెట్టిన ఈ మూవీకి త్రివిక్రమ్ రైటర్. కె. విజయభాస్కర్ డైరెక్షన్‌తో పాటు స్క్రీన్‌ప్లే సమకూరిస్తే త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందించాడు.
రైటర్‌గా ఆయనకిది ఫస్ట్ మూవీ. ఆ తరువాత చాలా సినిమాలకు రైటర్‌గా తనదైన మార్కు సంభాషణలు, స్టోరీలు అందించిన త్రివిక్రమ్ `నువ్వే నువ్వే`తో దర్శకుడిగా మారడం, ఆ తరువాత వెనుదిరిగి చూసుకోకుండా వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన `స్వయంవరం` సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న లయ `టాటా బిర్లా మధ్యలో లైలా` తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి 2006లో పెళ్లి చేసుకుంది.
అమెరికా వెళ్లి అక్కడే సెటిలైంది. మధ్యలో `బ్రమలోకం టు యమలోకం వయా భూలోకం`, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసినా టాలీవుడ్‌లో పూర్తి స్థాయి పాత్రల్లో కనిపించలేదు. మళ్లీ ఇంత కాలానికి లయ తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోంది. నితిన్ నటించిన `తమ్ముడు` సినిమాతో లయ రీఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ జూలై 4న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ 23 ఏళ్ల క్రితం నాటి తొలి సినిమా అనుభూతల్ని పంచుకుంది.
అప్పట్లో చూడ్డానికి చదువుకున్న వాడిలా ఉండే త్రివిక్రమ్ సినిమాల్లోకి ఎందుకు వచ్చాడా? అని అనుకునేదట. అయితే ఇప్పుడు ఆయన టాప్ డైరెక్టర్ కావడం తనని ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పుకొచ్చింది. రచయితగా త్రివిక్రమ్ రాసిన తొలి డైలాగ్‌లు పలికే అదృష్టం తనకే దక్కిందన్న లయ ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో అవకాశం ఇస్తే మరోసారి తనతో కలిసి పని చేయడానికి తాను సిద్ధమని చెబుతోంది. తన కోసం మళ్లీ హైదరాబాద్‌కు వస్తానంటోంది. మరి లయ మాటలు త్రివిక్రమ్ వింటాడా? విని తనకు అవకాశం ఇస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
