Begin typing your search above and press return to search.

ఇత‌ర‌ స్టార్ల‌ను అన‌సూయ ప‌రోక్షంగా ప్ర‌శ్నిస్తుందా?

ఈ క్రమంలో సినీ నటి, యాంకర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 March 2026 12:11 PM IST
ఇత‌ర‌ స్టార్ల‌ను అన‌సూయ ప‌రోక్షంగా ప్ర‌శ్నిస్తుందా?
X

టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ తాజాగా మహిళల గౌరవంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైర‌లవుతున్నాయి. మొద‌టి నుంచి మ‌హిళ‌ల ప‌ట్ల అపార గౌర‌వంతో ఉండే తార‌క్, మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, సమాజంలో మహిళలను గౌరవించే సంస్కారం పుట్టుకతోనే ప్రారంభం కావాలని పేర్కొన్నారు. ముఖ్యంగా తన ఇద్దరు కొడుకుల‌ను మహిళలను గౌరవించేలా పెంచుతానని తారక్ ఇచ్చిన మాట అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

ఎన్టీఆర్ వీడియోను షేర్ చేసిన అన‌సూయ‌

ఈ క్రమంలో సినీ నటి, యాంకర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాయి. మహిళా సాధికారత, సమానత్వం వంటి అంశాలపై తరచూ తన అభిప్రాయాలను వెల్లడించే అనసూయ, తారక్ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పందించారు. మహిళల గౌరవం గురించి ఒక స్టార్ హీరో బహిరంగంగా మాట్లాడటం చూడటం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సమాజంలో ప్రభావం కలిగిన వ్యక్తులు ఇలాంటి విషయాలపై మాట్లాడితే అది మంచి మార్పుకు దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడినట్టు కనిపిస్తోంది.

మిగిలిన స్టార్లు స్పందించాలి

అయితే అనసూయ పోస్టులో వేరే విష‌యాలు కూడా ప్ర‌తిస్పుటిస్తున్నాయ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మహిళల గురించి మాట్లాడటాన్ని ప్రశంసించిన ఆమె వ్యాఖ్యలు, ఇతర స్టార్ హీరోలు ఈ అంశంపై ఎక్కువగా స్పందించకపోవడంపై పరోక్షంగా ప్రశ్న లేవనెత్తినట్టుగా భావిస్తున్నారు. ప్రముఖులు సామాజిక అంశాలపై మాట్లాడితే అది సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయం అనసూయ వ్యాఖ్యల ద్వారా వ్యక్తమైందని కొందరు విశ్లేషిస్తున్నారు.

మహిళల భద్రత, గౌరవం లాంటి అంశాలు ప్రస్తుతం సమాజంలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ వేదికలను ఉపయోగించి ఇలాంటి విషయాలపై మాట్లాడటం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న స్టార్ హీరోలు ఇచ్చే సందేశాలు యువతపై ప్రభావం చూపుతాయని సామాజిక వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనను రాబట్టాయి. తన ఇద్ద‌రు కొడుకుల‌ను మహిళలను గౌరవించేలా పెంచుతానని ఆయన చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. తారక్ మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో అనసూయ చేసిన స్పందన కూడా కొత్త చర్చకు దారి తీసింది.

మొత్తానికి మహిళల గౌరవం గురించి ఒక ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై అన‌సూయ చేసిన ప్రశంసలు కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. సమాజంలో మహిళల పట్ల గౌరవం పెరగాలంటే కుటుంబం నుంచే ఆ విలువలు మొదలవ్వాలన్న సందేశం ఈ చర్చల ద్వారా మరోసారి ముందుకు వచ్చినట్టైంది.