Begin typing your search above and press return to search.

తమిళంలో తెలుగు సినిమాలు ఎందుకు ఆడవు.. విక్రమ్ ఏమన్నారంటే..

తమిళంలో టైర్ 2 హీరోల సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి మంచి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:04 AM GMT
తమిళంలో తెలుగు సినిమాలు ఎందుకు ఆడవు.. విక్రమ్ ఏమన్నారంటే..
X

తమిళంలో టైర్ 2 హీరోల సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి మంచి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. విజయ్ అంటోనీ లాంటి మినిమం రేంజ్ హీరో నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమా వరకు కోలీవుడ్ నుంచి చాలా సినిమాలు తెలుగులోకి వస్తాయి. వారికి తెలుగు మార్కెట్ లో మంచి బిజినెస్ ఉంది. అందుకే మాతృభాషతో పాటు తెలుగులో కూడా తమ సినిమాలు కచ్చితంగా రిలీజ్ అయ్యేలా అక్కడ హీరోలు ప్లాన్ చేసుకుంటారు.

అయితే తెలుగు హీరోలు మాత్రం ఆ ధైర్యం చేయరు. బాహుబలి తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, ఆర్ఆర్ఆర్, కాంతారా సినిమాలు తమిళనాట మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అయితే వారి సినిమాలు తెలుగులో సక్సెస్ అయిన రేంజ్ లో మాత్రం ఆదరణ రాలేదనే ఫీలింగ్ ఇండస్ట్రీ సర్కిల్ లో ఉంది.

ఈ మధ్య టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా బ్రాండ్ తో మూవీస్ చేస్తూ తమిళంలో కూడా తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే నార్త్ బెల్ట్ లో వచ్చిన ఆదరణ కూడా తెలుగు సినిమాలకి తమిళనాట రావడం లేదు. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన దసరా, విరూపాక్ష సినిమాలని కూడా పెద్దగా ఆదరించలేదు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ చియాన్ విక్రమ్ ని తాజాగా అడిగారు.

ఆయన నటించిన తంగలాన్ మూవీ తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అవుతోంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా ఓ తెలుగు జర్నలిస్టు విక్రమ్ ని ప్రశ్నించారు. కోలీవుడ్ నుంచి వచ్చే చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. వాటిలో చాలా వరకు సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే ఈ స్థాయిలో తెలుగు సినిమాలని తమిళంలో ఎందుకు ఆదరించడం లేదు అని ప్రశ్న వేశారు..

అలాంటి కల్చర్ తమిళనాట లేదని, తెలుగు సినిమాలైన బాహుబలి 2 మొన్నటి వరకు తమిళంలో హైయెస్ట్ గ్రాస్ మూవీగా ఉందని అన్నారు. అలాగే కాంతారా, కేజీఎఫ్ లాంటి సినిమాలకి మంచి ఆదరణ లభించిందని, ప్రేక్షకులు నచ్చే సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు అంటూ విక్రమ్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. దీనిపై తెలుగు నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. జర్నలిస్టు అడిగిన ప్రశ్నతో ఏకీభవిస్తున్నారు. అక్కడ టైర్ 2 హీరోల సినిమాలకి తెలుగులో వచ్చే కలెక్షన్స్ మన స్టార్ హీరోల మూవీస్ కి తమిళంలో రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.