Begin typing your search above and press return to search.

బిగ్ డిబేట్: ఆర్టిస్టు హ్యాండిస్తే నిర్మాత‌ న‌ష్టాల‌కు ఎవ‌రు బాధ్యులు?

ఇటీవ‌ల ఓ రెండు సంఘ‌ట‌న‌లు సినీప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌గా మారాయి. సినిమా ప్రారంభానికి ముందు న‌టీన‌టులు హ్యాండ్ ఇవ్వ‌డం వ‌ల్ల నిర్మాణ సంస్థకు క‌లిగే న‌ష్టం ఎలా ఉంటుంది? అంటూ డిబేట్ మొద‌లైంది.

By:  Tupaki Desk   |   10 Feb 2026 1:00 PM IST
బిగ్ డిబేట్: ఆర్టిస్టు హ్యాండిస్తే నిర్మాత‌ న‌ష్టాల‌కు ఎవ‌రు బాధ్యులు?
X

ఇటీవ‌ల ఓ రెండు సంఘ‌ట‌న‌లు సినీప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌గా మారాయి. సినిమా ప్రారంభానికి ముందు న‌టీన‌టులు హ్యాండ్ ఇవ్వ‌డం వ‌ల్ల నిర్మాణ సంస్థకు క‌లిగే న‌ష్టం ఎలా ఉంటుంది? అంటూ డిబేట్ మొద‌లైంది. అక్ష‌య్ కుమార్ నిర్మిస్తున్న హేరా ఫేరి 3 నుంచి ప‌రేష్ రావ‌ల్ త‌ప్పుకున్న‌ప్పుడు జ‌రిగిన న‌ష్టం.. అలాగే ఫ‌ర్హాన్ అక్త‌ర్ నిర్మిస్తున్న `డాన్ 3` నుంచి ర‌ణ్ వీర్ సింగ్ అర్థాంత‌రంగా చివ‌రి నిమిషంలో వైదొలిగిన‌ప్పుడు నిర్మాణ సంస్థ‌కు క‌లిగి న‌ష్టాలు ఎలా ఉన్నాయి? ఆర్టిస్టులు చివ‌రి నిమిషంలో ఇలా చేయ‌డం క‌రెక్టేనా? అంటూ చ‌ర్చ వేడెక్కిస్తోంది.

సినిమా ప్రారంభానికి ముందు హీరోలు త‌ప్పుకున్న సంద‌ర్భాలు భార‌తీయ చిత్ర‌సీమ‌లో అనేకం ఉన్నాయి. ఈ త‌ర‌హా గొడ‌వ‌లు ఇంకా ఉన్నాయి. ఒక‌వేళ న‌టీన‌టులు చివ‌రి నిమిషంలో హ్యాండిస్తే నిర్మాత‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలా? స్క్రిప్టు న‌చ్చ‌క సినిమా నుంచి త‌ప్పుకుంటే అది త‌ప్పు కాదా? ఈ స‌మ‌స్య‌ను ఏ కోణంలో చూడాలి? భ‌విష్య‌త్‌లో ఇలాంటివి త‌లెత్త‌కుండా ఏదైనా `బై లా` రాసుకోవాలా? లేదా చ‌ట్టాల‌ను స‌వ‌రించాల్సి ఉంటుందా? అంటూ నెటిజ‌నుల్లో బిగ్ డిబేట్ ర‌న్ అవుతోంది.

సినిమా రంగంలో ప్లానింగ్ ఎంత ముఖ్యమో, నటీనటుల సహకారం కూడా అంతే ముఖ్యం. చివరి నిమిషంలో షూటింగ్ నుంచి తప్పుకోవడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. గ‌త ఏడాది క్షయ్ కుమార్ తన ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న సీక్వెల్ చిత్రం `హేరా ఫేరి 3` నుంచి త‌ప్పుకున్నందున న‌టుడు ప‌రేష్ రావ‌ల్ నుంచి రూ. 25 కోట్ల పరిహారం కోరుతూ కోర్టులో కేసు వేశారు. ముందే ప్లాన్ చేసిన భారీ సెట్స్, ఇతర నటీనటుల డేట్స్ వృధా అవ్వడం వల్ల ఈ నష్టం వాటిల్లిందని అక్షయ్ త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు. అయితే పరేష్ రావల్ ఈ విషయాన్ని `టెక్నికల్ ఇష్యూ` అని కొట్టిపారేశారు. అయితే ఈ గొడవ వల్ల సినిమా ఆలస్యమైంది కానీ పరేష్ రావల్ మళ్లీ సెట్స్‌లోకి రావడానికి మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబురావు పాత్ర లేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది! అని పరేష్ స్వయంగా ఒప్పుకోవడంతో రాజీ దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది.

డాన్ 3 విష‌యంలో తాజా వివాదం ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌గా మారింది. దురంధర్ భారీ విజయం తర్వాత రణవీర్ సింగ్ `డాన్ 3` నుంచి తప్పుకోవడం ఇటీవ‌ల‌ హాట్ టాపిక్ అయింది. న‌టుడు నిర్మాత అయిన‌ ఫ‌ర్హాన్ కి చెందిన‌ ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ కి ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌డంతో ర‌ణ్ వీర్ కి రూ. 40 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఫ‌ర్హాన్ డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పీజీఐ) మధ్యవర్తిత్వంతో స‌మ‌స్య‌పై చ‌ర్చిస్తున్న‌ట్టు వెల్ల‌డైంది. చర్చలు విఫలమైతే ఇది కచ్చితంగా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. రణవీర్ మాత్రం స్క్రిప్ట్ నచ్చక త‌ప్పుకోవ‌డం త‌న‌ హక్కు అని వాదిస్తున్నారు.

ఈ త‌ర‌హా ఇత‌ర చారిత్రక ఉదాహరణలు ప‌రిశీలిస్తే...

సినిమా చరిత్రలో ఇలాంటివి చాలా ఉన్నాయి. గ‌తంలో క‌హో నా ప్యార్ హై నుంచి షూటింగ్ మొదలైన తర్వాత బెబో క‌రీనా క‌పూర్ దీని నుంచి తప్పుకున్నారు. ఆ త‌ర్వాత అమీషా పటేల్ ఈ పాత్ర‌ను రీప్లేస్ చేశారు. క‌హోనా ప్యార్ హై పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అలాగే `చల్తే చల్తే` నుంచి షూటింగ్ మధ్యలోనే ఐశ్వ‌ర్యారాయ్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్థానంలో రాణి ముఖర్జీని రీప్లేస్ చేశారు. దోస్తానా 2 నుంచి ధర్మ ప్రొడక్షన్స్ కార్తీక్ ఆర్య‌న్ ని తొలగించింది. చాలా షూటింగ్ చేసాక క‌ర‌ణ్‌- కార్తీక్ మ‌ధ్య పొస‌గ‌లేదు. దీనివల్ల భారీ నష్టం వాటిల్లిందని కరణ్ జోహార్ పేర్కొన్నారు. దోస్తానా 2 ఇప్ప‌టికీ తెర‌కెక్క‌లేదు.. పూర్తి కాలేదు. అయితే ఈ మూడు సంద‌ర్భాలు పై రెండు ఘ‌ట‌న‌ల‌తో పోలిస్తే చాలా భిన్న‌మైన‌వి. కొంత న‌ష్టం జ‌రిగినా కోలుకోగ‌లిగేవే.

నిర్మాతకు పరిహారం చెల్లించాలా?

స్క్రిప్ట్ నచ్చకపోతే ఆర్టిస్టు తప్పుకోవడం తప్పా? అంటే దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. సినిమా సైన్ చేసే ముందే స్క్రిప్ట్ నచ్చక తప్పుకుంటే ఏ సమస్యా ఉండదు. ఒక నటుడు అగ్రిమెంట్‌పై సంతకం చేసి, అడ్వాన్స్ తీసుకుని, ప్రీ-ప్రొడక్షన్ లో భాగంగా సెట్ డిజైన్లు, కాస్ట్యూమ్ డిజైన్, టెక్నీషియ‌న్ల అడ్వాన్సుల‌ కోసం నిర్మాత కోట్లు ఖర్చు చేసిన తర్వాత తప్పుకుంటే అది ఒప్పంద ఉల్లంఘన కిందకు వస్తుంది. అప్పుడు నిర్మాతకు నష్టపరిహారం కోరే హక్కు ఉంటుంద‌ని చ‌ట్టం చెబుతోంది.

చట్టాలు - బై లాస్

ప్రస్తుతం మన చలనచిత్ర రంగంలో కచ్చితమైన చట్టాలు లేవు.. అందుకే ఇలాంటి గొడవలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. నిర్మాతలు ప్రస్తుతం పే ఆర్ ప్లే తరహా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. అంటే నటుడు తప్పుకుంటే పరిహారం కట్టాలి లేదా నిర్మాత సినిమా ఆపేస్తే నటుడికి ఫుల్ పేమెంట్ ఇవ్వాలి. అయితే గ్లామ‌ర్ రంగంలో క్రియేటివ్ ఫ్రీడమ్-కమర్షియల్ లాస్ మధ్య సమతుల్యత కోసం ప్రత్యేకమైన చట్టాలు ఉండాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుతున్నారు.

నటులు తప్పుకోవడం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు.. ఆ సినిమాపై ఆధారపడిన వందలాది మంది కార్మికుల ఉపాధి కూడా దెబ్బతింటుంది. అందుకే రణవీర్ - ఫర్హాన్ అక్తర్ వివాదం సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద గుణపాఠం కాబోతోందని భావిస్తున్నారు. అక్ష‌య్ కుమార్ - ప‌రేష్ కూడా వివాదం ప‌రిష్క‌రించుకుని ముందుకు వెళ్లాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.