నేను కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్నా! కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 24 Sept 2023 5:50 PM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను కూడా చావు నుంచి బయటపడిన వాడినని..కొన్ని రకాల పరిస్థితులు తనని కూడా ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసాయని చెన్నైలో జరిగిన ఓ వెంట్ లో బయట పెట్టారు. `అప్పుడు నాకు సరిగ్గా 20 ఏళ్లు ఉండొచ్చు. అప్పుడే తొలిసారి ఆత్మహత్య ఆలోచన వచ్చింది. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావడం లేదని చాలా బాధపడ్డాను. కానీ నేను చనిపోతే ఎంతో ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని చిత్ర పరిశ్రమ బాధపడుతుందని భావించాను.
నా గురువు అనంతకు కూడా ఇదే విషయం చెప్పాను. ఆయన నీ పని నువ్వు చేసుకుంటూ పో.. సరైన సమయం వచ్చినప్పుడు ఆ గుర్తింపు దానంతటదే వస్తుందని సలహా ..భరోసా కల్పించారు. దీంతో ఆత్మహత్య చేసుకోవడం సబబు కాదు అనిపించింది. హత్య ఎంత నేరమో! ఆత్మహత్య కూడా అంతే నేరం పాపం. చీకటి ఎవరి జీవితంలో శాశ్వతం కాదు. అలాగే వెలుగు కూడా అంతే. రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. అదే జీవితం.
నిద్రపోయినప్పుడు వచ్చేది కల.. నిద్రపోనివ్వకుండా చేసేది అసలైన కల. చావు అనేది కూడా జీవితంలో ఓ భాగమే. దానికోసం మనం ఎదురు చూడకూడదు. రోజు పడుకునే ముందు నీ లక్ష్యాలు.. కలని గుర్తు చేసుకోండి. అది నెరవేరుతుందా? లేదా? అన్నది తర్వాత సంగతి. దానికోసం నువ్వు ఎంత పనిచేసావ్ అన్నది ఆలోచించు అని కొంత మంది విద్యార్ధులకు కమల్ హాసన్ హితబోధ చేసారు.
జీవితంలో లక్ష్యాలు చేరుకోలేదని....ప్రేమ వైఫల్యం చెందిందని....పరీక్షలు పాస్ అయ్యామని నిత్యం ఆత్మహత్యలు చోటు చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. అలాగే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి డిప్రెషన్ కి గురై ఏటా ఎంతో మంది అకారణంగా అసువులు బాసుతున్నారు. డిప్రెషన్ అనే మానసిక రుగ్మత నుంచి అంతా బయటకు రావాలని...జీవితాన్ని అన్ని కోణాల్లో చూడాలని సూచించారు. ఇటీవలే నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా డిప్రెషన్ కి గురై ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కమల్ హాసన్ విద్యార్ధుల ఓ సమావేశంలో పై వ్యాఖ్యలు చేసారు.
