చిన్మయి, అనసూయల గురించి శివాజీ ఏమన్నారంటే!
దండోరా ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరోసారి పూర్తి వివరణ ఇచ్చారు.
By: Tupaki Desk | 24 Dec 2025 4:19 PM ISTదండోరా ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరోసారి పూర్తి వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై స్పందిస్తూ ఆయన రెండు విభిన్నమైన అంశాలను ప్రస్తావించారు. ఒకటి తన నోటి నుంచి వచ్చిన ఆ రెండు అన్ పార్లమెంటరీ పదాలు, రెండు అసలు ఆ మాట అనడానికి గల కారణం. ఆ రెండు బూతు పదాలు వాడినందుకు మాత్రం బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని, తన 30 ఏళ్ల కెరీర్ లో, పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ అలా హద్దు దాటలేదని, ఆ రోజు కర్మ కాలి అలా దొర్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, తాను చేసిన వ్యాఖ్యల తాలూకు ఉద్దేశానికి మాత్రం కట్టుబడే ఉన్నానని శివాజీ స్పష్టం చేశారు. ఆ రెండు పదాలు తప్ప, మిగతా కంటెంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చారు. లులు మాల్ లో నిధి అగర్వాల్ పడ్డ ఇబ్బంది, ఆ తర్వాత సమంత విషయంలో జరిగిన సంఘటనలే తనను అలా మాట్లాడేలా చేశాయని చెప్పారు. 90 శాతం మంది అలనాటి నటీమణులు కట్టు బొట్టుతో ఉంటూ ఇండస్ట్రీకి గౌరవం తెచ్చారని, సినిమా వల్లే సమాజం చెడిపోతుందనే నింద పడకూడదనే ఉద్దేశంతోనే ఆవేదన వ్యక్తం చేశానే తప్ప, ఎవరినీ ఫలానా డ్రెస్ వేసుకోవద్దని చెప్పలేదని అన్నారు.
ఇక ఈ వివాదంలోకి చిన్మయి, అనసూయ పేర్లు రావడంపై శివాజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ రోజు రాత్రి 11, 12 గంటల సమయంలో సోషల్ మీడియాలో నెటిజన్లు రాహుల్ భార్య చిన్మయిని, యాంకర్ అనసూయను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారో తనకు అర్థం కాలేదని అన్నారు. వారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వెళ్తుండటాన్ని తాను గమనించానని, బహుశా వారు స్పందిస్తారని జనం భావించి ఉంటారని అభిప్రాయపడ్డారు.
కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, ఆ రోజు ఆ పదాలు వాడటం తన కర్మ అని శివాజీ వ్యాఖ్యానించారు. తప్పు తన వైపు ఉంది కాబట్టి, ఇప్పుడు వస్తున్న ట్రోలింగ్ ను, విమర్శలను భరించాల్సిందేనని అన్నారు. తప్పు చేశాం కాబట్టి పడక తప్పదని, అందుకే సిన్సియర్ గా అపాలజీ చెప్తున్నానని అన్నారు. కానీ తాను ఇచ్చిన స్టేట్మెంట్ లోని అంతరార్థానికి మాత్రం కట్టుబడే ఉంటానని తేల్చి చెప్పారు.
సమాజంలో ఏ తప్పు జరిగినా దానికి సినిమాలే కారణం అని అంటుంటారని, ఇక్కడే బతుకుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తనకు ఆ మాటలు బాధ కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మన ఇండస్ట్రీ పట్ల చిన్నచూపు రాకూడదనే తపనతోనే ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చిందే తప్ప, ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని వెల్లడించారు. చివరగా, ఆ రెండు పదాలకు మాత్రమే తన క్షమాపణలు పరిమితమని, ఆడబిడ్డలకు, తోటి నటీమణులకు సారీ చెప్తున్నానని అన్నారు.
