Begin typing your search above and press return to search.

'దసరా' విలన్‌కి యాక్సిడెంట్‌.. తండ్రి మృతి

టాలీవుడ్‌లో దసరాతో పాటు రంగబలి, దేవర, రాబిన్‌ హుడ్‌, డాకు మహారాజ్ సినిమాల్లో విలన్‌గా నటించిన ప్రముఖ మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో ఇంట విషాదం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   6 Jun 2025 11:57 AM IST
దసరా విలన్‌కి యాక్సిడెంట్‌.. తండ్రి మృతి
X

టాలీవుడ్‌లో దసరాతో పాటు రంగబలి, దేవర, రాబిన్‌ హుడ్‌, డాకు మహారాజ్ సినిమాల్లో విలన్‌గా నటించిన ప్రముఖ మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది. ఆ ప్రమాదంలో షైన్‌ టామ్‌ చాకో తీవ్రంగా గాయపడ్డారు. కానీ ప్రాణాలతో బయట పడ్డారు. అయితే ఆయనతో పాటు కారులో ఉన్న తండ్రి మాత్రం మృతి చెందారు. షైన్‌ టామ్‌ యాక్సిడెంట్‌ విషయం మలయాళ మీడియాలో ప్రముఖంగా రావడంతో అంతా షాక్ అయ్యారు. షైన్‌ టామ్‌ చాకో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి విషయమై ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సేలం - బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం షైన్ టామ్‌ చాకో ప్రయాణిస్తున్న ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో షైన్‌ టామ్ చాకోతో పాటు ఆయన తండ్రి, సోదరుడు, మేనేజర్ అనీస్‌ ఉన్నారు. టామ్‌ చాకో సోదరుడు, మేనేజర్‌లకు సైతం గాయాలు అయ్యారు. యాక్సిడెంట్‌ జరిగిన వెంటనే అందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. పోలీసు వర్గాల వారు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం షైన్‌ టామ్‌ తండ్రి సీపీ చాకో వైద్య పరీక్షల కోసం త్రిసూర్‌ నుంచి బెంగళూరుకు తీసుకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

సేలం - బెంగళూరు హైవేలో పాలక్కడ్‌లోని పయ్యూర్‌ వద్ద ఒక నిలిపి ఉన్న లారీని వీరి కారు వెనుక నుంచి బలంగా గుద్దింది. దాంతో సీపీ చాకో అక్కడే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. షైన్‌, అతడి సోదరుడు, మేనేజర్‌ అనీస్‌ లు తీవ్ర గాయాలతో పాలక్కడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత వారిని ధర్మపురి మెడికల్‌ కాలేజ్‌కు తరలించినట్లుగా పోలీసు వర్గాల వారు ప్రకటించారు. ప్రస్తుతం షైన్ టామ్‌, అతడి సోదరుడు, మేనేజర్‌ ల ఆరోగ్యం పూర్తిగా సురక్షితం అన్నారు. యాక్సిడెంట్‌ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అంటున్నారు.

తండ్రిని ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో షైన్ టామ్ చాకో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా మృతి చెందిన సీపీ చాకో కి సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు మలయాళ స్టార్స్‌ తో పాటు, టామ్‌ చాకోతో అనుబంధం ఉన్న ఇతర భాషల సినీ ప్రముఖులు సైతం పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం టామ్‌ చాకో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన కోలుకుంటారని, మాట్లాడుతారని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.