ప్రకాష్ రాజ్ తల్లి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తల్లి మరణం ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
By: Madhu Reddy | 30 March 2026 12:04 PM ISTఫిలిం ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ ఇంట్లో ఇప్పుడు విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి సువర్ణ లత ఈరోజు ఉదయం తమ స్వగృహంలో తుది శ్వాస విడిచారు. సువర్ణలత వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్న సువర్ణ లత ఈరోజు ఉదయం కన్నుమూశారు. నేడు సాయంత్రం బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాతో స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ తన తల్లి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారన్న విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణలత మరణానికి సంతాపం తెలియజేస్తూ.. ప్రకాష్ రాజ్ కు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తల్లి మరణం ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
1965 మార్చి 26న బెంగళూరు మైసూర్లో జన్మించిన ప్రకాష్ రాజ్ చిత్ర నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, రాజకీయవేత్తగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే కొన్ని సంవత్సరాలపాటు కన్నడలో రంగస్థలం ప్రదర్శనలతో పాటు టెలివిజన్లో కూడా పనిచేసిన ఈయన.. ఆ తర్వాతే సినిమాలలోకి ప్రవేశించారు. మొదటిసారి కే బాలచందర్ దర్శకత్వం వహించిన డ్యూయెట్ అనే చిత్రంతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ప్రకాష్ రాజ్ అప్పటినుంచి తమిళంలోనే కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకున్న చిత్రాలలో నటిస్తూ సినీ తారగా ఎదిగారు.
ముఖ్యంగా బహుభాషా వేత్త అయిన ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా ఎక్కువ చిత్రాలలో నటించేవారు. క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ప్రకాష్ రాజ్ 1997లో మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే 1998లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం అంతఃపురం సినిమాకు కూడా నేషనల్ అవార్డును దక్కించుకున్నారు.. నటుడిగా దర్శకుడుగానే కాదు నిర్మాతగా 2011లో తన చిరకాల నాటక రంగ మిత్రుడైన బి సురేష్ దర్శకత్వం వహించిన పుట్టక్కన హైవే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి, కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు.
ఇంకా తన కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1994లో ప్రముఖ నటి లలిత కుమారిని వివాహం చేసుకున్నారు. మేఘన , పూజ అనే ఇద్దరు అమ్మాయిలతో పాటు ఒక కుమారుడు సిద్దు కూడా జన్మించారు. అయితే సిద్దు ఐదేళ్ల వయసులో గాలిపటం ఎగరవేస్తుండగా కిందపడి 2004లో మరణించాడు. ఇక కొడుకు పోయిన బాధతో కృంగిపోయిన ప్రకాష్ రాజ్ 2009లో తన భార్యకు విడాకులు ఇచ్చారు. తర్వాత 2010 ఆగస్టు 24న కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ను వివాహం చేసుకోగా వీరికి 2015లో వేదాంత్ అనే కుమారుడు జన్మించారు.
