Begin typing your search above and press return to search.

ప్రముఖ నటుడు మృతి

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ పలు సినిమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌ మృతి చెందారు.

By:  Tupaki Desk   |   24 May 2025 7:40 AM
ప్రముఖ నటుడు మృతి
X

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ పలు సినిమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌ మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ముకుల్‌ దేవ్‌ నిన్న రాత్రి మృతి చెందినట్లు నటి దీప్సికా నాగ్‌పాల్‌ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగి వందకు పైగా సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించడం ద్వారా అన్ని భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ముకుల్‌ దేవ్‌ మృతితో ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్లకే మంచి గుర్తింపు దక్కించుకుని విలన్‌గా పలు సినిమాల్లో మెప్పించిన ఈ నటుడు అన్ని భాషల్లోనూ సన్నిహితులను ఏర్పర్చుకున్నాడు.

54 ఏళ్ల ఈ నటుడు దూరదర్శన్‌లో నిర్వహించిన నృథ్య ప్రదర్శన కోసం మైఖేల్ జాక్సన్‌లా డాన్స్ చేయడం ద్వారా తన మొదటి బహుమానం ను సొంతం చేసుకున్నాడు. 8వ తరగతిలో ఉన్న సమయంలోనే ముకుల్‌ దేవ్‌ దూరదర్శన్‌లో కనిపించాడు. ఆ తర్వాత నుంచి మెల్ల మెల్లగా నటన వైపు అడుగులు వేశాడు. 2000 సంవత్సరంలో బుల్లి తెరపై కనిపించిన ముకుల్‌ దేవ్‌ అక్కడ కూడా మంచి మార్కులను సొంతం చేసుకోవడంతో బుల్లి తెర, వెండి తెరపై స్టార్‌గా నిలిచాడు. హిందీ సినిమా 'దస్తక్‌'తో 1996లో బాలీవుడ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే నటుడిగా గుర్తింపు దక్కడంతో బ్యాక్‌ టు బ్యాక్‌ ఆఫర్లు వచ్చాయి.

కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడం, పంజాబీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ, ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించి దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. న్యూ ఢిల్లీలోని జలంధర్ సమీపంలోని ఒక మారుమూల గ్రామంలోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఢిల్లీలోనే పెరిగిన ముకుల్‌ దేవ్‌ చదువు ఢిల్లీలోనే కొనసాగింది. తండ్రి అసిస్టెంట్‌ కమిషనర్ ఆఫ్ పోలీస్‌. ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు లేకున్నా కూడా నటనతో తక్కువ సమయంలోనే పాపులారిటీ సొంతం చేసుకుని, బిజీ నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చాడు. దాదాపు పాతిక ఏళ్ల పాటు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు.

ముకుల్‌ దేవ్‌ సోదరుడు రాహుల్‌ దేవ్‌. ఇతడు కూడా తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు అనే విషయం తెల్సిందే. ముకుల్‌ దేవ్‌ చివరగా హిందీ చిత్రం ఎట్‌ ది ఎండ్‌ లో కనిపించాడు. అతడు తెలుగులో చివరగా భాయ్‌ సినిమాలో నటించాడు. తెలుగులో ఇంకా నిప్పు, డబ్బు డబ్బు, మోర్‌ డబ్బు, కేడీ, అదుర్స్, బెజవాడ, కృష్ణుడు సినిమాల్లో నటించాడు. విలనిజం పండించడంలో తనకు తానే సాటి అని ఎన్నో పాత్రలతో నిరూపించుకున్న ముకుల్‌ దేవ్‌ మృతి కచ్చింగా ఇండస్ట్రీకి తీరని నష్టం అంటూ ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.