హీరోగా హిట్ సినిమా దర్శకుడు... అవసరమా భయ్యా?
టాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి కొన్ని పారా మీటర్స్ ఉంటాయి. స్కిన్ టోన్ మొదలుకుని, ఎత్తు, బరువు ఇలా చాలా విషయాలు టాలీవుడ్‌లో పరిగణలోకి తీసుకుంటారు.
By: Tupaki Desk | 5 July 2025 3:15 PM ISTటాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి కొన్ని పారా మీటర్స్ ఉంటాయి. స్కిన్ టోన్ మొదలుకుని, ఎత్తు, బరువు ఇలా చాలా విషయాలు టాలీవుడ్‌లో పరిగణలోకి తీసుకుంటారు. కానీ కోలీవుడ్‌లో అలా కాదు. కోలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చే వారికి నటనపై ఆసక్తి ఉంటే చాలు, నటించేందుకు ఓపిక ఉంటే చాలు. మిగిలిన విషయాల పట్ల తమిళ ప్రేక్షకులకు పెద్దగా పట్టింపు ఉండదు. చాలా మంది దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ కోలీవుడ్‌లో దర్శకులుగా, నటులుగా ఎంట్రీ ఇచ్చారు. అందంగా లేకున్నా, తెల్ల తోలు లేకున్నా కూడా కోలీవుడ్‌లో హీరోలుగా నటించవచ్చు అని చాలా మంది ఇప్పటికే నిరూపించారు. తెర వెనుక ఉండే వారు చాలా మంది తెర ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
కోలీవుడ్‌లో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ నటనలో రాణించారు, ముందు ముందు రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే దర్శకుడు అభిషన్ జీవంత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవల వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీతో ఇతడు సూపర్ హిట్ దక్కించుకున్నాడు. సింపుల్ మూవీని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకొనే విధంగా రూపొందించడంలో సఫలం అయ్యాడు. అందుకే టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలైన తర్వాత దర్శకుడు అభిషన్ జీవంత్ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. యంగ్ హీరోలు సైతం ఇతడి దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపించారు.
టూరిస్ట్ ఫ్యామిలీతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న దర్శకుడు అభిషన్ జీవంత్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. టూరిస్ట్ ఫ్యామిలీకి అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. అభిషన్ జీవంత్ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న అభిషన్ నటనలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమాల్లో ఇప్పటికే అతడికి మంచి పేరు ఉంది. ఇలాంటి సమయంలో నటుడిగా ఎంట్రీ ఇస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది తెలియదు. అయినా అభిషన్ జీవంత్ నటుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకోవడం చూస్తుంటే ఆయనకు గల ఆసక్తి కనిపిస్తుంది. కొందరు మాత్రం అవసరమా అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈ సినిమాలో అభిషన్ జీవంత్‌కు జోడీగా అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని షూటింగ్‌కు రెడీ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ తమిళ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అనశ్వర రాజన్ ఇటీవల పెద్ద సినిమాల్లో నటించింది. ఈ సినిమాలో అభిషన్, అనశ్వరలు జోడీగా నటించడం వల్ల అంచనాలు పెరుగుతాయని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా సక్సెస్ అయితే దర్శకత్వం కంటే యాక్టింగ్‌పైనే అభిషన్ జీవంత్ ఫోకస్ ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.