Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఆ ఒక్కటీ అడక్కు

By:  Tupaki Desk   |   3 May 2024 8:37 AM GMT
మూవీ రివ్యూ : ఆ ఒక్కటీ అడక్కు
X

'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్-ఫరియా అబ్దుల్లా-వెన్నెల కిషోర్-రాజా చెంబ్రోలు-రవి కృష్ణ-జేమీ లీవర్-అనీష్ కురువిల్లా-గోపరాజు రమణ-పృథ్వీ-గౌతమి-మురళీ శర్మ తదితరులు

సంగీతం: గోపీసుందర్

ఛాయాగ్రహణం: సూర్య

నిర్మాత: రాజీవ్ చిలక

రచన-దర్శకత్వం: మల్లి అంకం

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన అల్లరి నరేష్.. కొన్నేళ్ల నుంచి సీరియస్ టచ్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. అతను చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కామెడీ జానర్లో చేసిన సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. ట్రైలర్ చూస్తే మంచి ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అల్లరోడు ఈసారి ఏమేర నవ్వించాడో తెలుసుకుందాం పదండి.

కథ: గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగి. ఐతే వయసు మీద పడ్డప్పటికీ అతడికి పెళ్లి అవ్వదు. తన క్లాస్ మేట్ కూతురు కూడా పెళ్లీడుకు వచ్చినా తనకు ఇంకా పెళ్లి కాలేదని బాధ పడుతుంటాడు. వివాహం కోసం అనేక ప్రయత్నాలు చేసి.. చివరికి మ్యాట్రిమొనీ బాట పడతాడు. అక్కడ కొన్ని ప్రొఫైల్స్ చూసి విసుగెత్తిపోయాక.. సిద్ధి (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయి ప్రొఫైల్ నచ్చి తనను కలుస్తాడు. ఆమె అతడికి బాగా నచ్చుతుంది. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత సిద్ధిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు గణపతి. కానీ గణపతి నచ్చాడని చెబుతూనే తనకు నో చెబుతుంది. మరి దీని వెనుక కారణమేంటి.. సిద్ధి నేపథ్యమేంటి.. తన తిరస్కారం తర్వాత గణపతి ఎలా స్పందించాడు.. చివరికి అతడి పెళ్లయిందా లేదా అన్న విషయాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్. తన కామెడీ సంగతి పక్కన పెడితే.. ముందు అతణ్ని చూస్తేనే ప్రేక్షకుల ముఖం మీద నవ్వు పులుముకునేది. కానీ తనకు పేరు తెచ్చిపెట్టిన స్పూఫ్-పేరడీ కామెడీని అతిగా వాడేసి.. జనాలకు మొహం మొత్తేలా చేయడంతో చివరికి కామెడీనే వదిలేయాల్సి వచ్చింది. 'నాంది' లాంటి సీరియస్ సినిమా చేసి మెప్పించడం.. ఆ తర్వాత కూడా వరుసగా కొన్ని సీరియస్ సినిమాలు ట్రై చేయడంతో నరేష్ మీద కామెడీ ముద్ర తొలగిపోయింది. ఇలా 'కామెడీ' ఇమేజ్ పోయాక తిరిగి నవ్వించడం అంత తేలిక కాదని సునీల్ విషయంలో రుజువైంది. ఎంత గట్టిగా ట్రై చేస్తున్నా సరే.. సునీల్ నవ్వించలేకపోతున్నాడు. ఇప్పుడు నరేష్ వంతు వచ్చింది. నరేష్ ను వరుసగా కొన్ని సీరియస్ సినిమాల్లో చూశాక అతను తిరిగి నవ్వించాలంటే ఆ చిత్రంలో పేలిపోయే కామెడీ ఉండాలి. కథలో.. అలాగే నరేష్ పాత్రలో మంచి కామెడీ టచ్ ఉండేలా చూసుకోవాలి. ఐతే దర్శకుడు మల్లి అంకం మాత్రం ఇవేవీ లేకుండా కేవలం నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన కామెడీ క్లాసిక్ 'ఆ ఒక్కటీ అడక్కు' నుంచి ఆకర్షణీయమైన టైటిల్ మాత్రమే తీసుకుని అసలిది కామెడీ సినిమానా.. సీరియస్ మూవీనా అని తెలియని అయోమయంలో ప్రేక్షకులను నెట్టి చాలా మామూలుగా సినిమాను లాగించేశాడు. ఈ సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్ కొంచెం కొత్తది.. ప్రేక్షకులు రిలేట్ చేసుకోగలిగేదే అయినా.. దాన్నుంచి కామెడీ జనరేట్ చేయడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు.

వయసు పెరుగుతున్నా పెళ్లి కాకుండా ఇబ్బంది పడే క్యారెక్టర్ చేశాడు అల్లరి నరేష్ ఇందులో. ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ 'మల్లీశ్వరి'లో ఇలాంటి పాత్రలోనే బోలెడంత వినోదాన్ని పంచాడు. కానీ అదే తరహాలో కామెడీకి మంచి స్కోప్ ఉన్న పాత్ర.. కథ అయినా.. రైటింగ్ చాలా సాధారణంగా ఉండడం వల్ల 'ఆ ఒక్కటీ అడక్కు' నిరాశకు గురి చేస్తుంది. 'ఆ ఒక్కటీ అడక్కు' అనే టైటిల్ వాడుకున్నారని ఆ సినిమాతో.. 'మల్లీశ్వరి'లో వెంకీ పాత్ర టైపు క్యారెక్టర్ నరేష్ చేశాడు కాబట్టి ఆ సినిమాతో ప్రేక్షకులు ఎంతో కొంత పోల్చుకోకుండా ఉండరు. కానీ వినోదం విషయంలో ఆ రెండు చిత్రాలకు దరిదాపుల్లో కూడా నిలవదు 'ఆ ఒక్కటీ అడక్కు'. అసలు దర్శకుడు ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనుకున్నాడా.. లేక వారికో సందేశం ఇవ్వాలనుకున్నాడా అన్నది అర్థం కాదు. కామెడీ సినిమాలా మొదలై.. చివరికి సీరియస్ గా ముగుస్తుందీ చిత్రం. నరేష్ ఉన్నంతలో బాగానే నటించినా.. అతను కామెడీ టచ్ కోల్పోయాడన్నది స్పష్టం. కామెడీ పండాలంటే ఎలాంటి అల్లరి చేయాలో నరేష్ కు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ అతను తన పాత స్టైల్ వదిలేసి హుందాతనంతో కూడుకున్న పెద్ద మనిషిలా కనిపించాడీ చిత్రంలో. దీంతో తన పాత్ర నుంచి ఫన్ ఏమాత్రం జనరేట్ కాలేదు. సహాయ పాత్రలు పోషించిన వాళ్లు సైతం పండించిన వినోదం అంతంతమాత్రమే. వెన్నెల కిషోర్.. ప్రవీణ్.. వైవా హర్ష.. షకలక శంకర్.. రఘుబాబు.. ఇలా తెర మీద చాలామంది కమెడియన్లు కనిపించినా.. ఎవ్వరూ పెద్దగా నవ్వించలేకపోయారు. వెన్నెల కిషోర్ తనకు అలవాటైన హీరో ఫ్రెండు పాత్రలో కనిపించి ఆరంభంలో కొంత ఆశలు రేకెత్తించినా.. ఆ తర్వాత సైడ్ అయిపోయాడు. తర్వాత ఏ పాత్ర తెరపైకి వచ్చినా నవ్వులు పండలేదు. తెలుగు ఆర్టిస్టులు సరిపోరని.. లెజెండరీ బాలీవుడ్ కమెడియన్ జానీ లీవర్ కూతురు జెమ్మీ లీవర్ ను తీసుకొచ్చి హీరో వదినగా ఓ ముఖ్య పాత్రే ఇచ్చారు. కానీ ఆమె కూడా కామెడీ పండించలేకపోయింది.

'ఆ ఒక్కటీ అడక్కు'లో చెప్పుకోదగ్గ విశేషం అంటే.. వయసు పెరుగుతున్నా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న కుర్రాళ్ల బాధను కళ్లకు కట్టినట్లు చూపించడమే. వాళ్ల ఆకాంక్షలను క్యాష్ చేసుకోవాలని చూస్తూ మ్యాట్రిమొనీ సంస్థలు చేసే మోసాల మీద కూడా ఇందులో చర్చించారు. ఐతే అది అంత ప్రభావవంతంగా అయితే లేదు. ద్వితీయార్ధంలో కథ రకరకాల మలుపులు తిరుగుతుంది కానీ.. ఆ మలుపులు అంత ఆసక్తికరంగా అనిపించవు. ఉన్నంతలో ప్రథమార్ధమే బెటర్. హీరోయిన్ పాత్ర తాలూకు ట్విస్ట్ ఇంటర్వెల్ దగ్గర కథ మీద ఆసక్తి పెరిగేలా చేస్తుంది. కానీ ఫేక్ ప్రొఫైల్ తో హీరోను మోసం చేసే హీరోయిన్ పాత్రను నెగెటివ్ షేడ్స్ తోనే నడిపిస్తూ.. హీరో హీరోయిన్ల మధ్య పోరు నడిపి ఉంటే కథనం రొటీన్ టెంప్లేట్లో అయినా ఇంట్రెస్టింగ్ గా సాగేదేమో. కానీ హీరోయిన్ పాత్రకు ఒక నిలకడ లేకుండా పోవడంతో ఆసక్తి సన్నగల్లిపోతుంది. హీరోయిన పాత్ర చిత్రణ ద్వితీయార్ధంలో పూర్తి గందరగోళంగా తయారవడంతో అందుకు తగ్గ కథ కూడా ఎటెటో పోతుంది. ప్రథమార్ధంలో అక్కడక్కడా అయినా కొన్ని నవ్వులు పండాయి కానీ.. రెండో అర్ధంలో కామెడీకి స్కోపే లేకపోయింది. వైవా హర్ష.. షకలక శంకర్ నవ్వించకపోగా విసిగిస్తారు. చివరి అరగంటలో కోర్ట్ రూం డ్రామాలో కూడా ఏ విశేషం లేదు. ముగింపు కూడా సాధారణంగా అనిపించి.. 'ఆ ఒక్కటీ అడక్కు' ఎలాంటి హై లేకుండా ముగుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే 'ఆ ఒక్కటీ అడక్కు' అనే ఒక క్లాసిక్ టైటిల్ ను చెడగొట్టడంలో తప్ప ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో విజయవంతం కాలేదు.

నటీనటులు: అల్లరి నరేష్ గణపతి పాత్రను సీరియస్ గా.. సిన్సియర్ గా పోషించాడు. కానీ అల్లరి ఈజ్ బ్యాక్ అంటూ సినిమాను ప్రమోట్ చేశాక ప్రేక్షకులు తన నుంచి ఒకప్పటి అల్లరిని.. వినోదాన్ని ఆశిస్తారు. ఆ విషయంలో నరేష్ నిరాశపరిచాడు. నటన.. హావభావాల విషయంలో తనను తాను మార్చుకున్న నరేష్ మళ్లీ పాత శైలిలోకి వెళ్లలేకపోతున్న విషయం స్పష్టమైంది. కామెడీ విషయంలో ఫెయిలైనా.. నరేష్ ఓవరాల్ పెర్ఫామెన్స్ బాగానే సాగింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చూడ్డానికి బాగుంది. నటన కూడా ఓకే. కానీ తన పాత్ర ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నరేష్ తో ఫరియాకు జోడీ అయితే బాగానే కుదిరింది. వెన్నెల కిషోర్ ఇలాంటి ఫ్రెండు పాత్రలు పదుల సంఖ్యలో చేశాడు. అతను ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాల్లో కొంత నవ్వించాడు. వైవా హర్ష.. షకలక శంకర్.. రఘు బాబు.. వీళ్లంతా పెద్దగా చేసిందేమీ లేదు. జెమ్మీ లీవర్ గురించి చెప్పడానికేమీ లేదు. రాజా చెంబ్రోలు.. రవి కృష్ణల పాత్రలు నామమాత్రం. జడ్జిగా గౌతమి ఓకే. లాయర్ పాత్రలో మురళీ శర్మ ఎందుకో కానీ.. చాలా మొక్కుబడిగా నటించాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం: ఒకప్పుడు మరపురాని మెలోడీలు అందించిన గోపీసుందర్ ఈ మధ్య వరుసగా నిరాశ పరుస్తున్నాడు. 'ఆ ఒక్కటీ అడక్కు'లో అతడి ముద్రను చూపించే పాట ఒక్కటీ లేదు. ఏ పాటా వినసొంపుగా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సూర్య ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక కొత్త దర్శకుడు మల్లి అంకం నిరాశ పరిచాడు. అతను ఎంచుకున్న పాయింట్ ఈ తరం ప్రేక్షకులు రిలేట్ చేసుకునేదే అయినా.. దాన్ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. రైటింగ్ దగ్గరే సినిమా గ్రాఫ్ పడిపోయింది. సరైన కామెడీ సిచువేషన్లు లేక.. డైలాగుల్లో పంచులు పడక.. ప్రేక్షకులకు నవ్వులు కరవయ్యాయి. పోనీ సీరియస్ డ్రామా అయినా ఆసక్తికరంగా సాగిందా అంటే అదీ లేదు. దర్శకుడిగా మల్లికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: ఆ ఒక్కటీ అడక్కు.. నో అల్లరి

రేటింగ్- 2.25/5